
ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము, విజయవాడ.
తేదీ.10-12-2025.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు భవానీ దీక్షల విరమణ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు
బందోబస్త్ అధికారులకు దిశా నిర్దేశం చేసిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్
ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపైన వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు ది.11.12.2025వ తేదీ నుండి ది. 15.12.2025వ తేదీ వరకు 5 రోజుల పాటు భవానీ దీక్షల మాల విరమణ కార్యక్రమము జరుగుతున్నది. భవానీ దీక్షామాల విరమణలను పురస్కరించుకుని నగరం నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి మరియు ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భవానీ భక్తులు విచ్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భవానీలు, భక్తులు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరియు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ఆస్కారం లేకుండా మరియు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయడం జరిగింది.
భవానీ దీక్షా విరమణను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీస్ అధికారులకు ది.10.12.2025వ తేదీన గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిదిలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో భవానీ భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు శాఖాపరంగా పాటించవలసిన నియమ నిబంధనల గురించి, గిరిప్రదక్షణ రూట్ ను, హోల్డింగ్ ఏరియాలు, స్నానఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలు మొదలైన ప్రదేశాలను డ్రోన్ కెమెరా వీడియోల రూపంలో వివరించి తగు సూచనలు మరియు సలహాలను అందించడం జరిగింది.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., బందోబస్తుకు విచ్చేసిన అధికారులకు దిశానిర్ధేశం చేశారు. సుదూర ప్రాంతాల నుండి దీక్షపూని భక్తితో వచ్చే భవానీల పట్ల మర్యాదగా నడుచుకుని వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, విధులు నిర్వహించి వారికి సహకరించాలని తెలియజేశారు. సెక్టార్ అధికారులు వారి సెక్టార్ లో నియమించబడిన సిబ్బంది అందరూ సమర్ధవంతంగా విధులు నిర్వహించే విధంగా అప్రమత్తం చేయాలనీ, సెక్టార్ పరిదిలో రద్దీని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ అధికారులకు సమాచారం అందించాలని తెలియజేసారు. భవానీ దీక్షల సందర్భంగా వచ్చే భవానీలకు ఎటువంటి ట్రాఫిక్ అవాంతరాలు కలుగకుండా, ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా, సమర్ధవంతంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు.
పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు:
భవానీ దీక్షా విరమణ బందోబస్తు డ్యూటీలను రెండు షిప్టులలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, బయట నుండి వచ్చే అధికారులు మరియు సిబ్బంది వారికి అనువుగా వసతి ఏర్పాటు చేయడం జరిగిందని, ఐందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందికి ఏవైన సమస్యలు ఉంటే వెంటనే పర్యవేక్షణాధికారులకు తెలియజేయాలన్నారు.
ముఖ్యంగా అమ్మవారి అంతరాలయం పరిసర ప్రాంతాలు, కొండ దిగువన, క్యూలైన్లు, విరుముడి విరమణ ప్రదేశాలు, హోమగుండాలు, ప్రసాదం కౌంటర్లు, కనకదుర్గా నగర్, రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు జరుగకుండా ఉండేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేయడమైనది.
ఈ సంవత్సరం భవానీ దీక్షల విరమణ బందోబస్తును 12 కాంపోనెంట్లలో మొత్తం 71 సెక్టార్లుగా విభజించి వివిధ జిల్లాల నుండి మరియు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ నుండి మొత్తం 4129 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని వినియోగించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., డి.సి.పి.లు కృష్ణ కాంత్ పటేల్ ఐ. పి. ఎస్. బి.లక్ష్మీనారాయణ ఐ.పి.ఎస్. షిరీన్ బేగం ఐ.పి.ఎస్. ఎస్.వి.డి.ప్రసాద్ జి.ఆనంద్ బాబు ఏ.డి.సి.పి. గుణ్ణం రామ కృష్ణ ఇతర ఏ.డి.సి.పి.లు, ఏ.సి.సి.లు, ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐ.లు, సిబ్బంది పాల్గొన్నారు.
![]()
