మాదకద్రవ్యాలపై పోరు ఉధృతం చేయాలి.

Spread the love

విజయవాడ 11/11/2025

మాదకద్రవ్యాలపై పోరు ఉధృతం చేయాలి.

  • డ్రగ్స్ హాట్ స్పాట్స్ పై ప్రత్యేక దృష్టిసారించాలి.
  • ప్రతి నెలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
  • ఎన్ కార్డ్ (NCORD)& నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను చైతన్య పరచాలని, దీనికై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో ఎన్ కార్డ్ & నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించిన అనంతరం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ… జిల్లాలో 217 డ్రగ్ హాట్ స్పాట్లను గుర్తించినట్లు చెప్పారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని ఆదేశించారు. గడచిన మూడు నెలల్లో ఎన్టీఆర్ జిల్లా ఈగల్ బృందం రైళ్లలో ఏడు సోదాలు (రైడ్లు) బస్సులు, బైకులు,గోడౌన్ల లో 10 సోదాలు నిర్వహించి డ్రగ్స్ ని సీజ్ చేసినట్లు చెప్పారు. దాదాపు 200 మంది డ్రగ్స్ బాధితులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్న పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఒడిశా నుంచి విజయవాడ మీదుగా ఉత్తరభారతానికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాను ఆటోనగర్ లో గుర్తించి ఐదు లారీలు, ఒక కారు సీజ్ చేసి, ఐదుగురిని అరెస్టు చేసిన ఈగల్ బృందానికి అభినందనలు తెలిపారు. డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని ఈగల్ నంబర్ 1972 కు తెలపాలన్నారు. డ్రగ్స్ బాధితులు ఆర్ఆర్ పేటలోని జిల్లా డి అడిక్షన్ కేంద్రం, విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స, కౌన్సిలింగ్ సేవలు పొందవచ్చని చెప్పారు.
ప్రతినెలా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక అవగాహన ర్యాలీని నిర్వహించాలని ఆదేశించారు. ఎన్జీవోలు విద్యా సంస్థలపై దృష్టి సారించి యువతను చైతన్య పరచి, డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే దుష్పరిణామాలను వారికి తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం, నిల్వ, రవాణా, అమ్మకం ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం నేరమని, వీరికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పారు. సామాజిక బాధ్యతగా మాదకద్రవ్యాల నిరోధానికి తమ వంతు కృషి చేస్తామని కమిటీ సభ్యుల చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి కామరాజు, ఈగల్ సీఐ ఎం.రవీంద్ర, ఎస్సై ఎం.వీరాంజనేయులు, ఎస్ ఆర్ ఆర్ & సివిఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ఎన్జీవోలు పాల్గొన్నారు.

Loading