కిడ్నీ బాధితుల ఆరోగ్యానికి పూర్తి భ‌రోసా క‌ల్పిస్తున్నాం

Spread the love

ఎన్‌టీఆర్ జిల్లా/ఎ.కొండూరు, న‌వంబ‌ర్ 06, 2025

కిడ్నీ బాధితుల ఆరోగ్యానికి పూర్తి భ‌రోసా క‌ల్పిస్తున్నాం

  • నెఫ్రాల‌జిస్టు వైద్య సేవ‌ల‌ను విస్తృతం చేస్తాం
  • రోగుల‌కు మందులు, పౌష్టికాహారంపై ప్ర‌త్యేక దృష్టిపెడుతున్నాం
  • రోగులు వైద్యుల సూచ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి
  • వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి ఎ.కొండూరుకు కృష్ణా జ‌లాలు పంపిణీ చేస్తాం
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

జిల్లాలోని ఎ.కొండూరు, ప‌రిస‌ర ప్రాంతాల్లోని కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ‌ద్ధ పెడుతోంద‌ని, నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో వైద్య సేవ‌లు అందిస్తున్నామ‌ని, రానున్న జ‌న‌వ‌రి నుంచి కృష్ణా జ‌లాల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వెల్ల‌డించారు.
ఎ.కొండూరు, ప‌రిస‌ర ప్రాంతాల్లో కిడ్నీ బాధితుల‌కు అందిస్తున్న సేవ‌ల‌ను ప‌రిశీలించేందుకు గురువారం జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఎ.కొండూరు మండ‌లంలో ప‌ర్య‌టించారు. తొలుత వైద్యాధికారుల‌తో క‌లిసి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని ప‌రిశీలించిన అనంత‌రం కృష్ణారావు పాలెం గ్రామంలో ఓవ‌ర్ హెడ్ వాట‌ర్ ట్యాంక్ పైకెక్కి నీటి నాణ్యతను పరిశీలించారు. పీహెచ్‌సీలో డ‌యాల‌సిస్ సేవ‌లు పొందుతున్న కిడ్నీ బాధితుల‌తో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవ‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ డ‌యాల‌సిస్ సేవ‌ల‌పై రోగులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌న్నారు. రోగుల‌కు అవ‌స‌ర‌మైన మందుల‌తో పాటు పౌష్టికాహారంపై దృష్టిసారిస్తున్నామ‌న్నారు. రోగులు త‌ప్ప‌నిస‌రిగా వైద్యుల సూచ‌న‌ల‌ను పాటించి ఆరోగ్య‌క‌ర జీవితం దిశ‌గా ప‌య‌నించాల‌ని సూచించారు. నెఫ్రాలజిస్టు వైద్య సేవ‌ల‌ను విస్తృతం చేసేలా విజిట్స్ పెంచ‌నున్న‌ట్లు తెలిపారు. వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి ఎ.కొండూరుకు కృష్ణా జ‌లాలు పంపిణీ జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు.
క‌లెక్ట‌ర్ వెంట తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్ ఎస్‌.విద్యాసాగ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.

Loading