తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలను పర్యవేక్షించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

Spread the love

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలను పర్యవేక్షించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

  • పల్లెపాలెం గ్రామంలో పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులకు దుప్పట్లు, మందులు పంపిణీ

కోనసీమ, అక్టోబర్ 29: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పునరావాస చర్యలను పరిశీలించడానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఉద్యాన మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు కోనసీమ జిల్లాలోని అంతర్వేది మండలంలోని పల్లెపాలెం గ్రామాన్ని సందర్శించారు. తుఫాన్ సమయంలో గాలివానలు, అధిక వర్షాల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉందని మంత్రి తెలిపారు. పల్లెపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడి వారి అవసరాలు, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బాధితులకు దుప్పట్లు, మందులు, అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, వైద్య సేవలు త్వరితగతిన పునరుద్ధరించేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. తరువాత మంత్రి అచ్చెన్నాయుడు గోదావరి నది సముద్ర సంగమ స్థలమైన అంతర్వేది వద్ద తుఫాన్ ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. గోదావరి ప్రవాహం మరియు సముద్ర అలల పరిస్థితిని తెలుసుకుంటూ, స్థానిక మత్స్యకార కుటుంబాలతో మాట్లాడి వారి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత. ఎటువంటి పరిస్థితుల్లోనూ బాధితులు నిరాశ చెందకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Loading