
రాష్ట్ర సచివాలయం నుండి తీర ప్రాంత గ్రామాలను నేరుగా అప్రమత్తం చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి ఆర్టీజిఎస్ నుండి తుఫాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/నూజివీడు, అక్టోబర్, 28 : రాష్ట్ర సచివాలయం నుండి తీర ప్రాంత గ్రామాలను నేరుగా అప్రమత్తం చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని దీని కారణంగా ప్రజలు తుఫాన్ ప్రమాద తీవ్రతపై తెలుసుకుంటున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో తుఫాన్ సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి పార్థసారధి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ రెండు రోజుల ముందు నుండి ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం ద్వారా మొంథా తుఫాను నష్టాన్ని నివారించడానికి వీలు కలుగుతుందన్నారు. వాతావరణ హెచ్చరిక కేంద్రం అందించే తుఫాన్ హెచ్చరికలను రాష్ట్ర సచివాలయం నుండి నేరుగా తీర ప్రాంత ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చారన్నారు. దీని ద్వారా ప్రజలు అప్రమత్తమై నష్టాన్ని చాలావరకు నివారించవచ్చన్నారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గర్భిణీలను దగ్గరలోని పిహెచ్సి లకు తరలించామన్నారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా మండలాల అధికారులు తీవ్రత ఎక్కువగా ఉండే గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించడం జరిగిందన్నారు. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి చెప్పారు. భారీ గాలులు కారణంగా చెట్లు కూలితే వెంటనే తొలగించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించామని, విద్యుత్ స్తంబాలు కూలితే వెంటనే కొత్తవి ఏర్పాటుచేయాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించామన్నారు. భారీ వర్షాల సమయంలో కేజ్ వే , కల్వర్టులను ప్రజలను దాటకుంటా పికెటింగ్ లు ఏర్పాటుచేయాలని రెవిన్యూ, పోలీసు శాఖలను ఆదేశించామన్నారు. తుఫాన్ సమయంలో గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, అత్యవసర పరిస్థితిలో తప్ప ప్రజలు బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. సబ్ కలెక్టర్ బొల్లపల్లి వినూత్న, డిఎస్పీ కె.వి.వి. ఎన్ .వి. ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
![]()
