స్త్రీ శక్తి పథకం సూపర్ సిక్స్ లో సూపర్ హిట్
విజయవాడ 29/9/2025
ఇకపై దసరా అనగానే విజయవాడ గుర్తుకొస్తుంది
స్త్రీ శక్తి పథకం సూపర్ సిక్స్ లో సూపర్ హిట్
ఇప్పటివరకు అమ్మవారిని దర్శించుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షలు… నాలుగో తేదీ నాటికి మరో ఎనిమిది లక్షలు దర్శించుకునే అవకాశం
రాష్ట్రానికి మరింత సేవ చేసే శక్తి ప్రసాదించమని అమ్మవారిని వేడుకున్నా
ఇంద్రకీలాద్రిని మరింత అభివృద్ధి చేస్తాం
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
దేశంలో దసరా అనగానే కోల్ కత, మైసూర్ నగరాలు గుర్తుకు వస్తాయని, కానీ అమ్మవారి నవరాత్రులు, “విజయవాడ ఉత్సవ్” తో దసరా అనగానే ఇకపై విజయవాడ గుర్తుకు వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం నాడు, సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి సోమవారం ఆయన పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… సరస్వతీ తల్లి అంటేనే జ్ఞానానికి ప్రతీక అని చెప్పారు. పవిత్రమైన, విశిష్టమైన జన్మ నక్షత్రం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శక్తివంతమైన అమ్మవారు దుష్టశక్తులని అంతం చేసి అందరినీ రక్షిస్తుందని చెప్పారు.
ఇప్పటికే అమ్మవారిని 8 లక్షల మంది దర్శించుకున్నారని… అక్టోబర్ 4వ తేదీ నాటికి మరో ఎనిమిది లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉందని చెప్పారు. రద్దీకి తగ్గట్టుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో స్త్రీ శక్తి సూపర్ హిట్టని అన్నారు. స్త్రీ శక్తి వల్ల మహిళలంతా అమ్మవారిని దర్శించుకోగలుగుతున్నారని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతారని ఆకాంక్షించారు.
2014-19 మధ్య ఐదు కోట్లతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును, ఐదు కోట్లతో అర్జున వీధిని అభివృద్ధి చేశామని చెప్పారు. 9 కోట్లతో డార్మిటరి కాంప్లెక్స్ నిర్మించామని చెప్పారు. యాత్రికుల కోసం షెడ్ లను, 4 హై స్పీడ్ లిఫ్టులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పుష్కరాల సందర్భంగా దాదాపు 100 కోట్లు ఖర్చుపెట్టి ఘాట్ లను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.
26 కోట్లతో నిర్మిస్తున్న అన్న ప్రసాద భవనం ఆరు నెలల్లో పూర్తి అవుతుందని, 26 కోట్ల 50 లక్షల వ్యయం తో నిర్మిస్తున్న నూతన ప్రసాద కేంద్రం మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఐదున్నర కోట్లతో పూజ మండపం నిర్మించామని, 13 కోట్లతో చేపట్టిన ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ఐదు నెలల్లో పూర్తవుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ కే రామచంద్ర మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు,జేసీ ఇలక్కియా, దుర్గగుడి ఈవో శీనా నాయక్, దుర్గగుడి చైర్మన్ గా నియమితులైన బొర్రా రాధాకృష్ణ (గాంధీ) తదితరులు పాల్గొన్నారు.
![]()
