40వ జాతీయ క్రీడాపోటీలు ఏపిలోనిర్వహించే ప్రతిపాదనపై పి.టి ఉష‌ మద్దతు : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

4
0

 *27-02-2025*

40వ జాతీయ క్రీడాపోటీలు ఏపిలోనిర్వహించే ప్రతిపాదనపై పి.టి ఉష‌ మద్దతు : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

సీఎం నివాసంలో ఎంపి పి.టి ఉష‌ను క‌లిసిన ఎంపి కేశినేని, శాప్ చైర్మ‌న్ అనిమిని

విజ‌యవాడ‌ : 2028-29లో జరగనున్న 40వ జాతీయస్థాయి క్రీడాపోటీలను ఏపీకి కేటాయించేందుకు కృషి చేస్తాన‌ని ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ , రాజ్య‌స‌భ ఎంపి పిటి ఉష ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి హామీ ఇచ్చార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. గురువారం 

 ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నివాసంలో పి.టి.ఉష ను ఎంపి కేశినేని శివ‌నాథ్ , శాప్ చైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. 

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పిటి ఉషతో ఏపీ క్రీడాభివృద్ధికి సంబంధించిన అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించటంతోపాటు, ఏపీని క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్‌గా తీర్చిదిద్దాల‌నే సంక‌ల్పంతో దేశంలోనే అత్యుత్త‌మంగా రూపొందించిన‌ ఏపీ స్పోర్ట్స్ పాల‌సీ ను వివ‌రించారని…ఎంపి కేశినేని శివ‌నాథ్ విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 

 అలాగే 2028-29లో జరగనున్న 40వ జాతీయస్థాయి క్రీడాపోటీలను ఏపీకి కేటాయించాలని, జాతీయ పోటీల నిర్వహణకు అనుగుణంగా ఏపీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు చేప‌డుతున్న చ‌ర్య‌లు వివ‌రించార‌ని పేర్కొన్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2002లో నేష‌న‌ల్ గేమ్స్‌, 2003లో ఎఫ్రో-ఏషియ‌న్ గేమ్స్‌ను దిగ్విజ‌యంగా నిర్వ‌హించామ‌ని సంగ‌తి సీఎం చంద్ర‌బాబు పిటి ఉష‌కు వివ‌రించార‌ని తెలిపారు. 

 అలాగే 40వ జాతీయ క్రీడాపోటీల‌ను ఏపీలో నిర్వ‌హించేందుకు ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ నుంచి స‌హాయ‌స‌హ‌కారాలు అవ‌స‌ర‌మ‌ని సీఎం ఆకాంక్షించిన‌ట్లు చెప్పారు..ఇందుకు పి.టి ఉష బ‌దులిస్తూ గ‌తంలో హైద‌రాబాద్ వేదిక‌గా జాతీయ‌, ఎఫ్రో-ఏషియన్ గేమ్స్‌ను స‌మ‌ర్థ‌వంతంగా, దిగ్విజ‌యంగా నిర్వ‌హించిన సంగ‌తి విధిత‌మేన‌ని, 40వ జాతీయ క్రీడాపోటీల‌ను ఏపీకి కేటాయిస్తే నిర్వ‌హించ‌గ‌లిగే స‌మ‌ర్థ‌త‌, అనుభ‌వం త‌మ‌రికి ఉంద‌ని కొనియాడిన‌ట్లు తెలిపారు. ఈసారి ఏపీకి 40వ జాతీయ‌క్రీడాపోటీల‌ను కేటాయించేందుకు కృషి చేస్తామ‌ని ఆమె హామీ ఇచ్చిన‌ట్లు చెప్పారు.. ఈ కార్య‌క్ర‌మంలో శాప్ ఎండీ పీఎస్‌.గిరీషా , పి.టి.ఉష భ‌ర్త వి.శ్రీనివాస‌న్ , అథ్లెటిక్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా మాజీ జాయింట్ సెక్ర‌ట‌రీ ఆకుల రాఘ‌వేంద్ర పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here