స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ‌హిద్దాం

1
0

ఎన్‌టీఆర్ జిల్లా, జులై 29, 2025

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ‌హిద్దాం

  • స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు ఏర్పాట్ల‌ను పూర్తిచేయండి
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

రాష్ట్ర‌స్థాయి 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంను స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్ల‌ను ప్ర‌ణాళిక ప్ర‌కారం త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు-2025కు చేయాల్సిన ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌తో క‌లిసి మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఆగ‌స్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు చేయాల్సిన ఏర్పాట్ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌న్నారు. ముఖ్య‌మంత్రి, గౌరవ ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులతో పాటు దాదాపు అయిదువేల మంది విద్యార్థినీ విద్యార్థులు వేడుక‌ల్లో పాల్గొన‌నున్నార‌ని తెలిపారు. చిన్నారుల‌కు అవ‌స‌ర‌మైన అల్పాహారం, తాగునీరు వంటివి అందించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల‌న్నారు. ప్రాంగణంలో నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా విద్యుత్‌ శాఖాధికారులు జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర మందులతో ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలను ప్రత్య‌క్ష ప్రసారం చేయడంతో పాటు పబ్లిక్ అడ్రెసింగ్ సిస్ట‌మ్‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని సమాచార శాఖ అధికారులకు సూచించారు. రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌, ఆర్ అండ్ బీ, ట్రాన్స్‌కో, అగ్నిమాప‌క‌, ఏపీఎస్ఆర్‌టీసీ, వైద్య ఆరోగ్యం, పౌర స‌ర‌ఫ‌రాలు, ఉద్యాన త‌దిత‌ర శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్‌ ప్రకారం కేటాయించిన గ్యాలరీల వారీగా పాస్‌లను జారీచేయాల‌న్నారు. రిహార్సల్స్‌ నిర్వహించే నాటికి పూర్తిస్థాయి ఏర్పాట్లతో ప్రాంగణాన్ని సిద్దంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ల‌క్ష్మీశ అధికారులను ఆదేశించారు.
స‌మావేశంలో డీసీపీ కేజీవీ స‌రిత‌, డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, పౌర స‌ర‌ఫ‌రాల అధికారి ఎ.పాపారావు, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here