స్వచ్ఛ గన్నవరం సాధించేందుకు స్థానిక విద్యాధికులు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి
సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధించుదాం – పర్యావరణం కాపాడుదాం
గన్నవరం నియోజకవర్గ ప్రజలకు సకల వైద్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
50 పడకల ఆసుపత్రిగా గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా వెల్లడించిన ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల 3 వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఈరోజు సాయంత్రం గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను గూర్చి అడిగి తెలుసుకుంటూ, ఆసుపత్రి అభివృద్ధికి అనుసరించాల్సిన విధి విధానాలను సిబ్బందికి తెలియజేశారు. స్వల్ప కాల వ్యవధిలో ఆసుపత్రిలో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను కాల పరిమితులో పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యార్లగడ్డ వెంకట్రావు ప్రసంగిస్తూ గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను సమకూర్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రి కాంపౌండ్ వాల్ నిర్మాణం ఆసుపత్రి ఆవరణలో గ్రీనరీ వ్యవస్థ ఏర్పాటులు గడువులోగా పూర్తి చేయాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికుల సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ఉన్న సమస్యల పట్ల స్పందించారు పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను పెంచవలసిన అవసరం ఉందని అన్నారు. క్లీన్ అండ్ గ్రీన్, డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, పర్యావరణ పరిశుభ్రత తదితర అంశాల్లో ప్రగతి సాధించాలంటే పారిశుద్ధ్య కార్మికుల వలనే సాధ్యం కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్న వారి వేతనాలను పెంచవలసిందిగా ప్రభుత్వం దృష్టికి తెలియజేస్తానని తెలిపారు.
గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరం టౌన్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అసెంబ్లీ సమావేశాల అనంతరం రిటైర్డ్ ఇంజనీర్ అక్కినేని రంగారావు గారితో కమిటీ వేసి అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా పనిచేస్తానని ప్రజలకు తెలిపారు.
గన్నవరం సి హెచ్ సి సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 50 గాని లేదా 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని అసెంబ్లీలో మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్లాలని 90 శాతం 50 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం, దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కామన్ గుడ్ ఫండ్ తదితర మార్గాల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే సంవత్సర కాలంలో సకల సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి యార్లగడ్డ మార్కు పాలన చూపే విధంగా గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రజలకు తెలిపారు.
మాజీ పార్లమెంటు సభ్యులు బాడిగ రామకృష్ణ గారు తనను టెలిఫోన్ ద్వారా సంప్రదించారని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా గన్నవరం టౌన్ కు 5 లక్షల రూపాయలను కేటాయిస్తానని హామీ ఇచ్చారని ఆ ఫండ్ ను ప్రభుత్వాసుపత్రిలో జనరేటర్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు వినియోగిస్తామని తెలిపారు.
గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడు నుండి కలపర్రు టోల్ గేట్ వరకు జాతీయ రహదారి కలిగి ఉన్నందున నిత్యం ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు అంబులెన్స్ వ్యవస్థ సైతం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
గన్నవరం టౌన్ లోని మేధావులు, రిటైర్డ్ టీచర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, రిటైర్డ్ డాక్టర్లు ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ మద్దతు తెలియజేయడంతో పాటు తగిన సూచనలు సలహాలు అందించాలని ఈ సందర్భంగా స్థానిక విద్యాధికులను ఉద్దేశించి యార్లగడ్డ పిలుపునిచ్చారు.
మన ఇంటిని ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలాగే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగైతేనే స్వచ్ఛ గన్నవరం సాధ్యమవుతుందని ప్రజలకు ఈ సందర్భంగా యార్లగడ్డ పిలుపునిచ్చారు.