*ఎన్‌టీఆర్ జిల్లా, ఏప్రిల్ 17, 2025*
స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు సరికొత్త ఊపు
రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్‌తో మారనున్న పారిశ్రామిక రంగ రూపురేఖలు
విజయవాడలో స్పోక్ ప్రాంతీయ కేంద్రం అభివృద్ధికి ముమ్మర కసరత్తు
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్)తో సరికొత్త ఊపు రానుందని.. ఈ హబ్‌తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
గురువారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్‌లో టాటా ఇన్నొవేషన్ హబ్ – స్పోక్‌పై సమావేశం నిర్వహించగా రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ (ఐటీఈ అండ్ సీ) ప్రత్యేక అధికారి దీప్తి రావులతో పాటు సమన్వయ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ స్టార్టప్, ఆవిష్కరణల వ్యవస్థలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ విధానాలను అమలుచేయడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రభుత్వం అమరావతిలో రతన్ టాట్ ఇన్నొవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఈ హబ్‌కు అనుసంధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్‌లో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మద్దతు, ప్రైవేటు నిర్వహణలో ఉండే ప్రధాన హబ్‌తో పాటు ప్రాంతీయ కేంద్రాలకు ప్రత్యేక బోర్డులు ఉంటాయని, ప్రాంతీయ కేంద్రానికి ఒక ప్రమోటర్ ప్రెసిడెంట్‌గా, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సహ ప్రమోటర్లు, ఇద్దరు స్వతంత్ర్య నిపుణులతో పాటు ప్రభుత్వం, విద్యారంగం, పారిశ్రామిక అసోసియేషన్ల నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఇందుకు ఏపీ ఇన్నొవేషన్ సొసైటీ దరఖాస్తులు ఆహ్వానిస్తుందన్నారు. పెట్టుబడులు, ఫైనాన్షింగ్, ఇంక్యుబేషన్, భాగస్వాముల నిర్వహణ, అకౌంటింగ్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ వంటి విధులను బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నిర్వహిస్తుందని వివరించారు. విజయవాడ ప్రాంతీయ స్పోక్ కేంద్రం కార్యకలాపాల నిర్వహణకు శాశ్వత ప్రాంగణం అందుబాటులోకి వచ్చేంతవరకు తాత్కాలిక భవనంతో పాటు మౌలిక వసతులు కల్పించడం, కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేలా చూడటంపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయి ఇన్నొవేషన్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్య సాధనకు, స్వర్ణాంధ్ర @ 2047 దార్శనికతను సాకారం చేయడంలో విద్యా సంస్థలు, పారిశ్రామిక సంఘాలు తదితరాలు భాగస్వాములవుతాయని సమావేశానికి హాజరైన ప్రతినిధులు స్పష్టం చేశారు.
సమావేశంలో విట్-ఏపీ ప్రతినిధి డా. అమీత్ చరణ్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రతినిధి ఉదయన్ బక్షి, మోహన్ స్పింటెక్స్ ప్రతినిధి వి.రమేష్, ఏపీఐఐసీ జెడ్ఎం కె.బాబ్జి, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.