ఎన్‌టీఆర్ జిల్లా, ఆగస్టు 07, 2025
సేవల్లో నిబద్ధతే నిండు ప్రాణాలను కాపాడుతుంది
- మాతృ, శిశు మరణాలు నమోదు కాకుండా విధులు నిర్వర్తించాలి
- ఆశా నుంచి వైద్యాధికారి వరకూ క్రమశిక్షణతో పనిచేయాలి
- నిర్లక్ష్యం వహించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా ఆశా కార్యకర్త నుంచి వైద్యాధికారి వరకు ప్రతిఒక్కరూ నిబద్ధతతో, క్రమశిక్షణతో సేవలందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
కలెక్టర్ లక్ష్మీశ.. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మాతృ, శిశు మరణాల పర్యవేక్షణ, ప్రతిస్పందన కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం మొదలు నమోదైన రెండు మాతృ, అయిదు శిశు మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ, వైద్యాధికారులు, స్పెషలిస్ట్ వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షించారు. మరణాలకు కారణాలను విశ్లేషించడంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి ప్రాణమూ అత్యంత విలువైనది.. తీసుకున్న చిన్నచిన్న జాగ్రత్తలే మాతాశిశు ప్రాణాలకు రక్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో గత అయిదేళ్ల కాలంలో నమోదైన మాతా, శిశు మరణాలకు కారణాలను విశ్లేషించి, ఇలాంటి కారణాలతో భవిష్యత్తులో మరణాలు చోటుచేసుకోకుండా సమగ్ర కార్యాచరణను రూపొందించి, అమలుచేయాలని ఆదేశించారు. మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేయించుకునేలా గ్రామ స్థాయిలో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలని సూచించారు. వీరు తరచు గర్భిణీల ఇళ్లను సందర్శించి రక్తహీనత సమస్య ఏర్పడకుండా పౌష్టికాహారం, అవసరమైన మందులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ సిబ్బంది కూడా పోషకాహారం పరంగా సలహాలు సూచనలు ఇవ్వాలని, నిర్దేశించిన సరుకులు సకాలంలో అందేలా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్ దగ్గరి నుంచి గర్భిణీల ఆరోగ్యం వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని, హైరిస్క్ ఉన్న గర్భిణులపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శిశువులకు టీకాలు కూడా సరైన విధంగా వేసేలా మార్గదర్శనం చేయాలన్నారు. మాతా, శిశు మరణాల నియంత్రణకు ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు, విధానాల అమల్లోనూ వైద్య సేవలు అందించే విషయంలోనూ ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
సమావేశంలో డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. జె.ఇందుమతీదేవి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమం, సాధికారత అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం, వైద్య నిపుణులు, జీజీహెచ్ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.