ఎన్‌టీఆర్ జిల్లా, ఆగస్టు 07, 2025
సూక్ష్మ సేద్యం.. కీలక ప్రగతి సూచిక
- అధిక నాణ్యత పంట దిగుబడి, ఆపై సాగునీటి పొదుపు
- ఉద్యాన రైతుల్లో విస్తృత స్థాయిలో అవగాహన పెంచండి
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో సాగునీటి యాజమాన్యం చాలా ప్రధానమైనదని.. సాగునీటి వనరుల సద్వినియోగంలో భాగంగా బిందు సేద్యం, తుంపర సేద్యంపై రైతులకు అవగాహన పెంచాలని, జిల్లాలో 2024-25 వరకు 23,937 హెక్టార్లు సూక్ష్మ సేద్యం కింద ఉందని.. 2025-26లో కొత్తగా 2,200 హెక్టార్లను ఈ విధానంలోకి తీసుకొచ్చేలా అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏపీ మైక్రో ఇరిగేషన్ పథకం (ఎంఐపీ) కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇగ్నైట్‌సెల్‌ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. సూక్ష్మ సేద్యంపై అవగాహన పెంచేందుకు రూపొందించిన కరపత్రాలను, డ్రిప్, స్ప్రింకర్, రైన్ గన్‌లకు సంబంధించిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సాగునీరు, కరెంటు వినియోగంలో 50 శాతం పొదుపుతో పాటు ఉన్న నీటితో ఎక్కువ విస్తీర్ణానికి నీరు అందించడం సూక్ష్మ సేద్యంతో సాధ్యమవుతుందని.. భూసారానికి, భూ సమతుల్యతకు ఎలాంటి హానీ కలగకుండా సాగువ్యయంలో దాదాపు 40 శాతాన్ని ఈ విధానంతో ఆదా చేసుకోవచ్చన్నారు. మామిడి, జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, కొబ్బరి వంటి పంటలతో పాటు కూరగాయలు, పూల తోటలకు కూడా సూక్ష్మ సేద్యం బాగుంటుందని.. డ్రిప్, స్ప్రింకర్ పరికరాలకు ప్రభుత్వం రాయితీ ఇస్తోందని వివరించారు. రైతు సేవా కేంద్రాలు, ఏపీ ఎంఐపీ కార్యాలయం ద్వారా వివరాలు పొంది, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన రంగాల స్థూల జోడింపు విలువ (జీవీఏ)లో వృద్ధికి సూక్ష్మ సేద్యం విధానాలు కూడా ఉపయోగపడతాయని.. ఉపాధి హామీ పథకం సహాయంతో ఈ ఏడాది నాలుగువేల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేయడం జరుగుతోందని.. ఆయా రైతులను సూక్ష్మ సేద్యం దిశగా ప్రోత్సహించాలని కలెక్టర్ లక్ష్మీశ.. ఎంఐపీ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఏపీ ఎంఐపీ పీడీ పి.ఎం.సుభాని, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.