
సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్ : యార్లగడ్డ
*రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాలు
- మూడు ప్రాంతాలు సమాన అభివృద్ధి
గన్నవరం :
విశాఖపట్నంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు అంచనాలకు మించి విజయవంతమైందని ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో రూ. 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు కుదుర్చుకోగా 16.13 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో నిర్వహించినప్పటికీ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాల్లోనూ సమానంగా పెట్టుబడులు పెట్టేలా మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేశారని వివరించారు. పవర్ సెక్టార్, డ్రోన్ రెన్యువబుల్ ఎనర్జీ, టెక్స్ టైల్ హబ్ గా రాయలసీమ, క్వాంటం, ఆక్వా, పోర్టు ఆధారిత ఇండస్ట్రియల్ హబ్ గా కోస్తా ఆంధ్ర, డాటా టెక్నాలజీ, ఏఐ సంస్థలు ఉత్తరాంధ్రలో ఏర్పాటు అవుతున్నాయని తద్వారా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వీటితోపాటు ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్.ఎస్.ఎం.ఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ద్వారా అన్ని నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని తద్వారా నిరుద్యోగులకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని యార్లగడ్డ పేర్కొన్నారు. విశాఖ సదస్సులో రూ. 13. 26 లక్షల కోట్ల పెట్టుబడులతో, 16.13 లక్షల మందికి ఉద్యోగాలు లభించేలా 613 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. సదస్సుకి ఒకరోజు ముందే రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులతో 1.26 లక్షల ఉద్యోగాలు కల్పించేలా 35 సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకోవడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్న విషయం తేటతెల్లమవుతుందన్నారు. సదస్సు తొలి రోజు రూ.28.26 లక్షల కోట్ల పెట్టుబడులతో, 12.05 లక్షలు మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు యార్లగడ్డ వివరించారు. జగన్మోహన్ రెడ్డి వేధింపులతో భయపడి వెళ్లిపోయిన రెన్యూ, హీరో ఫీచర్స్, ఏబీసీ సంస్థలు రాష్ట్రానికి తిరిగి వచ్చి పెట్టుబడులు పెడుతుండటం చంద్రబాబు పై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకానికి, కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఎమ్మెల్యే వెంకట్రావ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసి ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని యార్లగడ్డ కొనియాడారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ రాష్ట్రంలోని ఐటీ యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెద్ద సంఖ్యలో ఐటీ సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని లోకేష్ కృషి ఫలితంగా ఇప్పటికే ఐటీ సంస్థలు రాష్ట్రానికి క్యూ కట్టాయని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వ కృషి తో రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు అవడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువతకు యార్లగడ్డ భరోసా ఇచ్చారు.
![]()
