సాగునీటి ఇబ్బందులు తొలగిస్తాం : యార్లగడ్డ
- యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు
గన్నవరం :
గన్నవరం నియోజవర్గంలో రైతుల సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చిన యార్లగడ్డ ముందుగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించిన ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతీరును లబ్ధిదారులు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో రూపొందించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగునీటి కొరత ఏర్పడిందని దీని నివారణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కాలువ కింది గ్రామాల్లో సాగునీటి కొరతను తీర్చేందుకు ఏలూరు కాల్వకు గరిష్టంగా నీటిని విడుదల చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పోలవరం కాలువ పరివాహక ప్రాంతంలో తన సొంత నిధులతో అందించిన మోటార్ల ను ఏర్పాటు చేసుకుని రైతులు సాగునీటి ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. గన్నవరం నియోజకవర్గంలో యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వివరించారు. మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల్లో మరో రెండేళ్లలో పూర్తిస్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని ఇవి పూర్తయితే సుమారు 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి నాయకులు చిరుమామిళ్ల సూర్యం, దొంతు చిన్న, గూడవల్లి నరసింహారావు, ఆళ్ల వెంకట గోపాలకృష్ణ రావు, బొప్పన హరికృష్ణ, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, గన్నవరం మండల టిడిపి ప్రధాన కార్యదర్శి బోడపాటి రవికుమార్, ముస్తాబాద్ గ్రామ పిఎసిఎస్ చైర్మన్ మేడేపల్లి రమ, ముస్తాబాద్ గ్రామ సర్పంచ్ వేము రాధాకృష్ణ, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కోసరాజు సాయిరాం, ముస్తాబాద గ్రామ టిడిపి అధ్యక్షులు కడియాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి కురేటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చోడవరపు వెంకటేశ్వరరావు, సీనియర్ టిడిపి నాయకులు పాలడుగు మల్లికార్జునరావు, గొంది నరేంద్ర, బుస్సే నాగప్రసాద్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పరచూరి నరేష్, కృష్ణాజిల్లా అంగన్వాడి మరియు డ్వాక్రా విభాగం అధ్యక్షురాలు పొదిలి లలిత, కంభంపాటి లక్ష్మి, నెక్కంటి శ్రీదేవి, గ్రామ తెలుగు యువత నాయకులు కలపర్తి అనిల్, బొద్దు ఫనీంద్ర, పోలింగ్ బూత్ ఇన్చార్జీలు చాగర్లమూడి యుగంధర్, బోడా ధర్మారావు, అంటారు పొడేటి శాంత, గుంటూరు ప్రసాదు, మొవ్వ వెంకటేశ్వరరావు, తాటిపాముల నాగయ్య, జల్లెడ శ్రీమన్నారాయణ, వస్త్ర ఇన్చార్జి అన్నే హరికృష్ణ, బండి బాలకృష్ణ, యనమదల సతీష్, అంకం రామారావు, జాస్తి రేణుక, ఇలప్రోలు పార్వతి తదితరులు పాల్గొన్నారు.