
ఎన్‌టీఆర్ జిల్లా, నవంబర్ 20, 2025
సాంస్కృతిక కళా సంపదను కాపాడుకుందాం..!
- కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించేలా వినూత్న కార్యక్రమాలు
- ఈ నెల 22, 23 తేదీల్లో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆధునిక జీవనశైలిలో మసకబారుతున్న కళలు, సాంస్కృతిక కళా సంపదను పరిరక్షించుకుంటూ వాటిని భావితరాలకు అమూల్యమైన వారసత్వ సంపదగా అందించేందుకు కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించేలా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కొహాన్స్ సంస్థ సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశ గురువారం కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కథలు, కవితలు, కార్టూన్ల విభాగంలో పోటీలు కూడా నిర్వహించడం జరిగిందని.. 500కు పైగా ఎంట్రీలు వచ్చాయని, ఉత్తమ రచనలకు నగదు బహుమతులు ప్రదానం చేయనున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతకు సరైన దిశానిర్దేశం లభిస్తుందని, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లేందుకు చేయూత, నూతనోత్సాహం లభిస్తుందన్నారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారానికి జిల్లాలో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని.. ఇందులో భాగంగా మరో ముందడుగుగా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రసిద్ధ సాహితీవేత్తల ప్రసంగాలు, సాహితీ సేవామూర్తులకు సత్కారాలు, కథ, కవిత, కార్టూన్ల పోటీ విజేతలక నగదు బహుమతుల ప్రదానం తదితరాలు ఉంటాయన్నారు. ప్రతిఒక్కరూ భాగస్వాములై ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
సమావేశంలో మల్లెతీగ మాసపత్రిక ఎడిటర్ కలిమిశ్రీ, సీనియర్ జర్నలిస్టు, కాలమిస్టు యేమినేని వెంకటరమణ, సాహితీవేత్త గోళ్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
![]()
