సమగ్ర ఎన్నికల సంస్కరణలు ఆవశ్యం

Spread the love

సమగ్ర ఎన్నికల సంస్కరణలు ఆవశ్యం

మీట్ ది ప్రెస్ లో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా

విజయవాడ : రాజ్యాంగబద్ధ ఎన్నికల సంఘం పాత్ర ప్రశ్నార్ధకమైన నేపథ్యంలో సమగ్ర ఎన్నికల సంస్కరణలు ఆవశ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఉద్ఘాటించారు. బీహార్ లో ఎన్నికల సంఘం ఎన్నో ఇబ్బందులను కల్పించిందన్నారు. తల్లిదండ్రుల పుట్టిన తేదీ సర్టిఫికెట్లను సమర్పించాలంటూ తీవ్రమైన ఆంక్షలు విధించిందని, తద్వారా అత్యధిక సంఖ్యాకులు ఓటర్లుగా నమోదు చేసుకోలేకపోయారని ఆయన పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి పార్టీలను నిరాశపరిచాయన్నారు. దీనిపై వారు నిశితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో డి. రాజా మాట్లాడారు.
దేశం నేడు సంక్లిష్ట పరిస్థితుల్లో ముందుకు సాగుతున్నదని, భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని ఆర్ఎస్ఎస్ తపాలా బిళ్ళను, ఆ సంస్థ శత వార్షికోత్సవం సందర్భంగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ కు అసలు రిజిస్ట్రేషన్ కూడా లేదన్నారు . దానివల్ల దేశంలోని చట్టాలకు అది సమాధానం చెప్పాల్సిన బాధ్యత, అవసరం ఆ సంస్థకు లేదన్నారు. అటువంటి సంస్థ ఈనాడు స్వాతంత్ర ఉద్యమం, దేశభక్తి గురించి గొప్పలు చెప్పుకోవడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ దేశ రాజ్యాంగాన్ని కానీ, జాతీయ పతాకాన్ని కానీ ఏనాడుడూ గౌరవించిన దాఖలాలు లేవన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కూటమి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించడం ద్వారా హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్నాయని రాజౄ మండిపడ్డారు. బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ఈ దేశానికి ఇటువంటి రాజ్య స్థాపన ఎంతో వైపరీత్యంగా పరిగణిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రాజ్యాంగంలో పేర్కొన్న సౌభ్రాతృత్వం , సమానత్వం, ఐక్యత ప్రాథమిక సూత్రాలను ఆర్ఎస్ఎస్ ఎన్నడూ అంగీకరించలేదని ఆయన గుర్తు చేశారు. దేశ అత్యున్నత చట్టసభైన పార్లమెంటు సక్రమంగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడిందన్నారు. దేశంలో మతోన్మాద పార్టీలు, కార్పొరేట్ శక్తుల మధ్య సంబంధాలు బలంగా ఏర్పడ్డాయని, విశాఖ ఉక్కు కర్మాగారం తో సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్లకు అప్పచెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు అనంతరం, ఇక పశ్చిమ బెంగాల్ వంతు అంటూ ప్రధాని మోదీ ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. బెంగాల్ ఒక సునిసితమైన రాష్ట్రం అన్నారు. 2026 లో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్లో ఎన్నికలు జరగనుండగా, ఆ రాష్ట్రాల్లో కూడా పాగా వేసేందుకు ఇప్పటినుండే కుటిల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణకు లౌకిక, వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచల జయరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ నగర యూనిట్ అధ్యక్ష , కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు ఐజేయూ సభ్యులు షేక్ బాబు. సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ .రమణారెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు పాల్గొన్నారు.

Loading