శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం
విశేషంగా ఆకట్టుకున్న అష్టలక్ష్మీ మండపం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు.
తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.