విజయవాడ, జులై 31, 2025
వైభవంగా ముగిసిన అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు
- ఆలయ పర్యవేక్షకులు ఎం.మల్లికార్జున
విజయవాడ, పున్నమ్మతోటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు గురువారం వైభవంగా ముగిసాయి. ఈ మేరకు ఆలయ పర్యవేక్షకులు ఎం.మల్లికార్జున తెలిపారు. చివరి రోజు 5,000 మందికి పైగా అన్న ప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో పున్నమ్మతోటలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జూలై 26వ తేదీ నుంచి అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలను ఆగమ శాస్త్ర ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించామని.. చివరి రోజు గురువారం మహాపూర్ణాహుతి, ఆలయప్రవేశం, మహాసంప్రోక్షణ, అక్షతారోహణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. బ్రహ్మఘోషతో కార్యక్రమం ముగిసిన్నట్లు వివరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విశేష హోమాలు కార్యక్రమంలో పాల్గొని.. స్వామి వారిని దర్శించి అన్న ప్రసాదం స్వీకరించారని మల్లికార్జున తెలిపారు. ఈ కార్యక్రమ విజయవంతానికి కృషిచేసిన దాతలు, టీటీడీ అర్చక స్వాములు, వేద పండితులు, సేవకులు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.