వైద్యులు దేవుడితో సమానం : యార్లగడ్డ
రాజధాని అభివృద్ధిలో వైద్యులు భాగస్వాములు కావాలి
గన్నవరం :
దైవం మనిషికి ప్రాణం పోస్తే ఆ వ్యక్తి ప్రాణం పోకుండా కాపాడి పునర్ జీవితాన్ని ఇచ్చే శక్తి వైద్యులకు మాత్రమే ఉందని, అందుకే మన సమాజంలో వైద్యులను దైవం భావిస్తారని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అభిప్రాయపడ్డారు. మండల పరిధిలోని చిన్నఆవుటపల్లి గ్రామంలో గల పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో వారం రోజులపాటు జరిగే ఆరోగ్య అవగాహన ప్రదర్శన ను సోమవారం ఉదయం ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యార్లగడ్డ మాట్లాడుతూ వైద్యులు కేవలం డబ్బు సంపాదన కోసమే కాకుండా మానసిక తృప్తి కోసం పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని సూచించారు. ఎంతోమంది వైద్యులు పేద రోగులకు ఉచితంగా వైద్య సాయం చేస్తూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. వైద్యులకు అనునిత్యం ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని వాటిని ధీటుగా ఎదుర్కొని రోగుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో వైద్యులు తమ వంతు సహకారం అందించాలన్నారు. రాష్ట్రంలో అధునాతన వసతులతో కూడిన వైద్యశాలలు అందుబాటులో లేకపోవడంతో రోగులు హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాలకు తరలి వెళ్లి వైద్య చికిత్సలు పొందుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ చదువుకుంటున్న వైద్య విద్యార్థులు ప్రపంచంలో మేటి రాజధానిగా నిలవబోతున్న అమరావతి ప్రాంతంలో వైద్యశాలలు ఏర్పాటు చేసి అమరావతిని మెడికల్ హబ్ గా చేసే ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేయాలని కోరారు. ఏ వృత్తిలో అయినా గెలుపుకు దగ్గర దారులంటూ లేవన్న యార్లగడ్డ హార్డ్ వర్క్ ద్వారానే గెలుపు సాధ్యమని స్పష్టం చేశారు. 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన సిద్ధార్థ అకాడమీ లాభాపేక్ష లేకుండా నేడు 20 విద్యాసంస్థలతో, ప్రతి ఏటా 26 వేల మంది విద్యార్థులకు విద్యను అందించటం అభినందనీయమన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాఠశాలలు, కళాశాలలను అకాడమీ తీసుకుని వాటికి పూర్వవైభం తీసుకురావటానికి కృషి చేయాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడం అభినందనీయమని దీన్ని నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని అధ్యాపకులను విద్యార్థులను ఈ సందర్భంగా యార్లగడ్డ అభినందించారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు మలినేని రాజయ్య మాట్లాడుతూ యార్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం గన్నవరం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్న యార్లగడ్డను ఏదైనా పని అడిగితే ఆపని పూర్తి అయ్యేవరకు ఫాలోఅప్ చేస్తారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, వైద్య కళాశాల ప్రిన్సిపల్ మేజర్ భీమేశ్వరరావు, డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, కోశాధికారి సూర్రెడ్డి వెంకటేశ్వరరావు, కళాశాల ఏవో అనిల్, దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామోజీరావు,తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన ఆసాంతం తిలకించిన యార్లగడ్డ విద్యార్థులకు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.