వేల్ మురుగ.. వెట్రి మురుగా.. ఙ్ఞాన మురుగా.. శరణం శరణం
• మురుగన్ భక్తులతో కలసి స్కంధ షష్టి కవచ పారాయణం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
• లక్షలాది మంది ఏక గళమై స్కంధ షష్టి కవచ పారాయణం
• 20 నిమిషాలపాటు సుబ్రహ్మణ్య భక్తులతో కలసి పారాయణం చేసిన పవన్ కళ్యాణ్
• పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించిన సాధు పుంగవులు
• వేలాయుధం బహూకరించిన హిందూ మున్నాని సంస్థ
• భక్త జన సంద్రంగా మధురై మురుగ భక్తర్గళ్ మానాడు
మధురై మీనాక్షి అమ్మ సాక్షిగా లక్షలాది మంది మురుగన్ భక్తులతో కలసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గళం కలిపారు. సుబ్రహ్మణ్యేశ్వర
స్వామికి ప్రీతిపాత్రమైన స్కంధ షష్టి కవచ పారాయణం చేశారు. 20 నిమిషాల పాటు అత్యంత భక్తి పారవశ్యంతో నేలపై కూర్చుని పారాయణం చేశారు. మధురై అమ్మ తిడల్ ప్రాంగణంలో హిందూ మున్నాని సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు వేల్ వేల్ మురుగ.. వెట్రి వేల్ మురుగ అంటూ నినదించారు. ఆద్యంతం భక్త జన సంద్రం జయ జయధ్వానాల మధ్య ఈ మహా సమ్మేళనం జరిగింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సభా ప్రాంగణానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి హిందూ మున్నాని సంస్థ ప్రతినిధులు, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. సభపై ఆశీనులైన పీఠాధిపతులు, సాధువులు, స్వామీజీలు పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక మాలలు వేసి ఆశీర్వచనాలు అందించారు. పీఠాధిపతులు, సాధువులు, స్వామీజీల ఆశీర్వచనాలు స్వీకరించారు.
• మురుగ భక్త వస్త్రధారణలో సభకు పవన్ కళ్యాణ్
మురుగ భక్తర్గళ్ సభకు ఆహ్వానం అందిన నాటి నుంచి ప్రత్యేక ఉపవాస దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ సభకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆకు పచ్చ ధోతి, కండువాతో కూడిన వస్త్రధారణలో హాజరయ్యారు. పీఠాథిపతులు పవన్ కళ్యాణ్ నుదుటిన విభూది దిద్ది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విశిష్టతను తెలియజేసే పుస్తకాన్ని బహూకరించారు. సభకు హాజరైన బీజేపీ తమిళనాడు అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్ పవన్ కళ్యాణ్ కి మురుగ పెరుమాళ్ విగ్రహాన్ని బహూకరించారు. మురుగన్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ప్రత్యేక హారతుల కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందూ మున్నాని సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ కి వేలాయుధాన్ని బహూకరించారు.
- మురగ భక్తర్గళ్ మానాడు సభలో శ్రీ సుబ్రహ్మణ్వేశ్వర స్వామిని స్తుతించే సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాల కావడి నృత్యం, అసుర సంహార నృత్య రూపకాలు ప్రదర్శించారు
- పవన్ కళ్యాణ్ కార్యక్రమం గురించి తెలియడంతో తిరుపతి, రైల్వే కోడూరు, రాజంపేట ప్రాంతాల నుంచి జనసేన పార్టీ నేతలు మధురై చేరుకొని విమానాశ్రయంలో హార్దిక స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ ని అనుసరించారు.
• ఆకట్టుకున్న ఆరు పదవీడు కోవిల్
మధురై మురుగ భక్తర్గళ్ కోసం హిందూ మున్నాని సంస్థ ఏర్పాటు చేసిన వేదిక, స్వాగత ద్వారాలు సుబ్రహ్మణ్వేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చి వెళ్లిన అనుభూతి పంచేలా రూపొందిచారు. వేదికపై ఆరు విఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాల గోపురాలు, మురుగన్ మూలవిరాట్టు నమూనాలు ఏర్పాటు చేశారు. స్వాగత ద్వారాలుగా ఆలయం వెలుపల ఉండే శిఖర గోపురాలను ఏర్పాటు చేశారు. సభ ముగింపు సందర్భంగా ఆరు సుబ్రహ్మణ్యక్షేత్రాల నమూనా విగ్రహాలకు హారతులు ఇచ్చి ముగించారు. పవన్ కళ్యాణ్ రాక, సభకు లక్షలాది మంది భక్తులు హాజరు కావడంతో నిర్వాహకుల్లో ఉత్సాహం నింపింది.