విశాఖలో మంత్రి నారా లోకేష్ 65వ రోజు ప్రజాదర్బార్
వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి వినతులు స్వీకరణ
జోరువానలోనూ ప్రజాదర్బార్ కొనసాగింపు
చివరి వ్యక్తి వరకూ కలిసి ఫోటోలు దిగిన మంత్రి లోకేష్
విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో ప్రజాసమస్యల త్వరితగతిన పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ఉత్తరాంధ్రలో తన రెండో రోజు పర్యటనలో విశాఖ పార్టీ కార్యాలయంలో 65వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్యుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలుసుకుని వారి సమస్యలు విన్నారు. ఆయా వినతులపై అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
అనాథలా వదిలేశారు, ఆదుకోండి!
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు నెలవారీ జీతం చెల్లించడంతో పాటు ఇంటర్ జోనల్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తన భర్త మరణించారని, ఉన్న ముగ్గురు పిల్లలు తనను అనాథలా వదిలేశారని, వృద్ధాప్య పెన్షన్ అందించి ఆదుకోవాలని విశాఖకు చెందిన అవ్వా కాంతం విన్నవించారు. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తన భర్త మరణించారని, తమ కుటుంబానికి చెందవలసిన ఆస్తిని అత్త, మామ, మరిది అన్యాయంగా కాజేశారని విశాఖకు చెందిన రెడ్లదిన్నె శ్రావణి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆదరణ లేక ఇద్దరు చిన్నపిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, విచారించి తగిన న్యాయం చేయాలని కోరారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు గారు 2020లో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు వైసీపీకి చెందిన కేకే రాజు సదరు పర్యటనను అడ్డుకుని నానా బీభత్సం సృష్టించారని, పోలీసులు తూతుమంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని విశాఖ తాటిచెట్లపాలెంకు చెందిన కే.గోపాల్ రెడ్డి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి గతంలో కేటాయించిన రెండున్నర ఎకరాల స్థలంలోనే శాశ్వత భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆనందపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్వలాభం కోసం సదరు స్థలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణానికి కొందరు యత్నిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో తమకు పసుపు-కుంకుమ కింద ఇచ్చిన 1.09 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమి తమకు వంశపారపర్యంగా వచ్చిందని, అయితే 2022లో జరిగిన రీసర్వేలో ఎఫ్ఎమ్ బీలో సదరు భూమి సబ్ డివిజన్ ను తప్పుగా నమోదు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని విశాఖ శాతవాహన నగర్ కు చెందిన వై.వసంత లక్ష్మి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్ది సదరు భూమిని ఆన్ లైన్ లో నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ లంకలపాలెంలోని కోనేరు అభివృద్ధి పనుల్లో రూ.1.20 కోట్ల నిధుల గోల్ మాల్ జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని 79వ వార్డు కార్పోరేటర్ రౌతు శ్రీనివాస మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయా సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
జోరువానలోనూ ఆగని ప్రజాదర్బార్
విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ జోరువానలోనూ కొనసాగింది. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి పలు సమస్యలపై వినతులు ఇచ్చేందుకు ఉదయం విశాఖ పార్టీ కార్యాలయానికి ప్రజలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఈ సమయంలో భారీ వర్షం కురిసింది. జోరువానలోనూ ప్రజాదర్బార్ ను కొనసాగించిన మంత్రి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చివరి వ్యక్తి వరకు కలిసి అందరితో ఫోటోలు దిగారు. ప్రజాసమస్యల పరిష్కారంపై మంత్రి లోకేష్ చిత్తశుద్ధి పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.