*విజయవాడ,తేదీ: 14.02.2025*
విజయవాడలో నాబార్డ్ గ్రామీణ భారత మహోత్సవం-ఆంధ్రప్రదేశ్ -2025 ఘనంగా ప్రారంభం
• *తయారీదారులతో నేరుగా అమ్మకాలతో తక్కువ ధరల్లో వస్తువులు*
• *హస్తకళలను ఆదరించి చేనేతను ప్రోత్సహించడమే లక్ష్యం*
• *స్థానికులను ఆకట్టుకునే విధంగా రకరకాల కళాత్మక వస్తువులు, వస్త్రాలు ప్రదర్శన*
• *చేనేత, హస్త కళాకారులను ఆదరించాలి*
– *డా. లక్ష్మీషా, ఐఏఎస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్*
నైపుణ్యం కలిగిన కళాకారులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా “గ్రామీణ్ భారత్ మహోత్సవ్ – ఆంధ్రప్రదేశ్ 2025” ను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీషా, ఐఏఎస్, తెలిపారు. విజయవాడ లోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన “గ్రామీణ్ భారత్ మహోత్సవ్ – ఆంధ్రప్రదేశ్ 2025” ను జిల్లా కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాబార్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం విజయవాడ వారు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లే ఈ ఏడాది కూడా “గ్రామీణ్ భారత్ మహోత్సవ్ – ఆంధ్రప్రదేశ్ 2025” లో భాగంగా రాష్ట్ర స్థాయి చేనేత మరియు హస్త కళల ప్రదర్శనను ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. కళాకారుల జీవితాలను మెరుగుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయన్నారు. సాంప్రదాయ చేనేత, హస్తకళలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), ఆఫ్ఫార్మ్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (OFPOలు) ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, నాబార్డ్ మార్కెటింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు.
నాబార్డు గ్రామీణాభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రను ప్రశంసిస్తూ, రైతులు, స్వయం సహాయక బృందాలు, మరియు సూక్ష్మవ్యా పారులు తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్లకు తీసుకెళ్లేందుకు ఇలాంటి ప్రదర్శనలను వినియోగించుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 14 నుండి 23 వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రామీణ కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం పొందుతారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ హస్తకళల్లో మంగళగిరి పట్టు, ఉప్పాడ, పొందూరు ఖద్దరు, తెలంగాణ ప్రత్యేకతలైన నారాయణపేట సిల్క్ & కాటన్ చీరలు, అలాగే శ్రీకాకుళంలోని సిక్కోలు కాటన్ చీరలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. తిరుపతికి చెందిన బాలాజీ హస్త కళలు, ధర్మవరం పట్టు చీరలు, శ్రీ బాలాజీ కాటన్ సిల్క్, కొండపల్లి, ఏటికొప్పాక వంటి సంప్రదాయ కళాఖండాలతో పాటు, తమిళనాడు నుండి ప్రత్యేకంగా వచ్చిన నవసారిగై OFPO పట్టు చీరలు కూడా ఈ ప్రదర్శనలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు.
నాబార్డు సీజీఎం ఎం. ఆర్. గోపాల్ (ఏపీ) మాట్లాడుతూ గ్రామీణ భారతదేశ అభివృద్ధి కోసం నాబార్డు చేస్తున్న సమగ్ర కృషిని వివరించారు. గ్రామీణ రైతులు, మత్స్యకారులు, చేనేత కళాకారులు, మరియు చిరు వ్యాపారస్తుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచేందుకు సహకారం అందిస్తూ, కొత్త ఆర్థిక నమూనాలను, సహకార సంస్థల బలోపేతాన్ని, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిని నాబార్డు ముందుకు తీసుకెళ్తోందన్నారు.
నాబార్డు (ఏపీ) జనరల్ మేనేజర్, డా. కె.వి.ఎస్. ప్రసాద్ హాజరైన అతిథులకు మరియు కళాకారులకు స్వాగతం పలుకుతూ.. ఈ మహోత్సవం గ్రామీణ కళాకారులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించే వేదికగా నిలుస్తుందన్నారు. నాబార్డు గ్రామాల పట్ల అనురక్తి చూపిస్తూ, హస్తకళలు, మట్టిపాత్రలు, చేతిపనుల ద్వారా ఉపాధి పొందే వారిని బలోపేతం చేయడానికి ఆర్థిక మద్దతు, శిక్షణ మరియు మార్కెట్ అనుసంధానం కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు.
డా. ఆర్. శ్రీనాథ్ రెడ్డి, MD, APCOB, శ్రీ కె. ప్రతాప్ రెడ్డి, ఛైర్మన్, APGVB మాట్లాడుతూ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి క్రెడిట్ లింకేజీలు ముఖ్యమైనదని, బ్యాంకింగ్ వ్యవస్థ మరింత చురుకుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. రాజేష్ కె. మహానా, GM, RBI మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించగా, శ్రీనివాస్ దాసియం, AGM, SLBC మాట్లాడుతూ చివరి మైలు ప్రాంతాలకు రుణ సహాయాన్ని విస్తరించడంలో బ్యాంకింగ్ వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేస్తుందన్నారు.
ఎం. శ్రీ రామచంద్ర మూర్తి, డీజీఎం నాబార్డు ఏపీ మాట్లాడుతూ ప్రదర్శనలో పాల్గొన్న ప్రముఖులు కళాకారుల మేళాపై ఆసక్తి చూపి, వారి కళను మెచ్చుకున్నారు. ఈ గ్రామీణ భారత్ మహోత్సవం – ఆంధ్రప్రదేశ్ 2025, నాబార్డు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తీసుకుంటున్న కీలకమైన చర్యలలో ఒకటిగా నిలుస్తూ, ఆర్థిక సమగ్రత, సహకార వ్యవస్థ బలోపేతం, మరియు స్థిరమైన అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. విజయవాడ వాసులందరు ఈ ప్రదర్శనకి హాజరై, గ్రామీణ కళాకారులను ప్రోత్సహించేందుకు, వారి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నాబార్డ్ కోరుతుందన్నారు.