లౌకిక రాజ్యాంగ పరిరక్షణ- మతోన్మాదశక్తుల మధ్యే పోటీ గందరగోళంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు
పొత్తుల వల్ల పార్టీలు బలహీనం కా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ:
అత్యధిక జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో 2024లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య కాదని, లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసే శక్తులు, మతోన్మాద శక్తులకు మధ్య జరుగుతున్న పోటీగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభివర్ణించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కంచర్ల జయరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య జరుగుతున్న పోటీని మేథావులు, రాజకీయ ఉద్ధండులు పరిశీలిస్తున్నారని చెప్పారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా మౌలిక సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మోదీ అధికారంలోకి రావటం జరిగిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసి ఆత్మహత్యలు లేకుండా చూస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తామని, ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలేక ఆత్మహత్యలు చేసుకుటుంన్నారని, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం శాఖల్లో ఖాళీగా ఉన్న 30లక్షల పోస్టులను భర్తీ చేయలేదన్నారు. దేశంలో నిరుద్యోగ రేటు 45ఏళ్ల వెనక్కు వెళ్లిందన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ధరలు బాగా పెరిగాయన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ధరల గురించి ఎన్నికల్లో మాట్లాడటం లేదన్నారు. తమ పరిపాలనలో పేదరికం తగ్గిందంటూనే 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని చెప్పటంలో అర్థం లేదన్నారు. జాతీయ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోతున్న వారితో బీజేపీ కుమ్మకైయిందని విమర్శించారు. విజయమాల్య తప్ప అందరూ గుజరాతీ వారేరని తెలిపారు. మోదీ అధికారం చేపట్టినప్పుడు రూపాయితో డాలర్ విలువ 59 ఉంటే ఇప్పుడు 83 రూపాయలు అయిందన్నారు. 1947 నుంచి 2014 వరకు పని చేసిన ప్రధాన మంత్రులు రూ.55లక్షల కోట్లు అప్పు చేస్తే మోదీ ప్రధాని అయిన తరువాత 2024 నాటికి అప్పు రూ.205 లక్షల కోట్లు అయిందన్నారు. దీంతో బీజేపీ అజెండా మార్చిందన్నారు. మత ప్రాతిపదికన ఓట్లు చీల్చి మెజార్టీ హిందువుల ఓట్లతో అధికారం సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేస్తే హిందు మహిళల పుస్తెలు తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుందంటూ ప్రచారం చేస్తుందన్నారు. ఐటీ, ఈడీ, ఎన్నికల కమీషన్ వంటి వ్యవస్థలను చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రతిపక్షాలను బెదిరిస్తుందన్నారు. ఢల్లీి ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అవినీతికి పాల్పడ్డాడని ఏడాదిగా జైల్లో ఉంచారని ఒక్క రూపాయి అవినీతిని బయటకు తీయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి కోట్ల రూపాయల మద్యం స్కాం జరుగుతుందని సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. మూడవ సారి పూర్తి మెజార్టీతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తప్పకుండా మార్చుతుందన్నారు. అధ్యక్ష తరహా పాలన తీసుకువస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంటు స్థానాల్లో గెలిపించి జగన్ మోహన్‌రెడ్డికి అధికారం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో జగన్ ముందు చంద్రబాబును విమర్శించటం, తరువాత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, మూడోఅంశంగా తాను బటన్‌నొక్కుతున్నా..నాకు బటన్‌నొక్కి ఓట్లు వేయండి అని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు కట్టాం, ఇక్కడ అభివృద్ధి జరిగిందని అనే చెప్పుకునే స్థితిలో వైసీపీ ప్రభుత్వం లేదన్నారు. 11 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని తెలిపారు. సెక్రటరియేట్, ఆర్ అండ్ బీ సంస్థలు, చివరకు మద్యం వ్యాపారాన్ని తాకట్టు పెట్టి అప్పు చేసినందుకు జగన్ సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తూ పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని చెప్పారు. నా ఎస్సీ, నా ఎస్టీలు, నా బీసీలు, అందరికీ సామాజిక న్యాయం చేస్తున్నట్లు ఊదరగొడుతున్నారని చెప్పారు. పైస్థాయిలో నిర్ణయాధికారం అంతా రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉందని అదీ కడప జిల్లాకు చెందిన వారివద్ద ఉందన్నారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గందరగోళంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ వంటివి ఏవీ మోదీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. పైగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని ప్రకటిస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకోవటం సరికాదన్నారు. గతంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వటం లేదని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మపోరాట దీక్ష చేసిన చంద్రబాబు తిరిగి అదే ఎన్డీఏలోకి వెళ్లటంలో అర్థం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా బీజేపీ వాళ్లు ఆ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని చెప్పటం జరిగిందన్నారు. ఢల్లీి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను జైల్లో పెడితే చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి ఖండిరచలేని నిస్సాహాయ స్థితిలో ఉన్నారని చెప్పారు. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ 1952లో మొదటిసారి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు అనేక రికార్డులు నెలకొల్పారని, మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాలతో ప్రస్తుతానికి కమ్యూనిస్టు బలం తగ్గిందన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5వేలు ఇవ్వటం విస్మయం కలిగిస్తుందన్నారు. తిరుపతి జిల్లాలో అన్ని పార్టీల తరుపున వైసీపీకి నుంచి వచ్చిన వారే పోటీల్లో ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. మూడవసారి సొంత బలంతో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీని రాజకీయంగా నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ అజెండా ప్రకారం మరింత దూకుడుగా వ్యవహరించి రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందన్నారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉన్నా పార్టీ నిర్ణయం మేరకు పోటీ చేయటం లేదన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేరళలో కాంగ్రెస్, వామపక్షాలు పోటీ చేయటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి వెళ్లకుండా చేయగలిగాం అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఇండియా కూటమికి ఎక్కువ స్థానాలు వస్తే మమత బెనర్జీతో పాటు ఇతర పార్టీలు ఇండియా కూటమికే మద్దతు ఇస్తాయని స్పష్టం చేశారు. ఎన్డీఏలో రెండవ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉందన్నారు. రాజకీయ పొత్తుల వల్ల ఏపార్టీ బలహీనం కాదన్నారు. ఒకప్పుడు పార్లమెంటులో కేవలం రెండు సీట్లు ఉన్న బీజేపీ అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుని బలపడిరదన్నారు. వలంటీర్ వ్యవస్థ సమక్రంగా పని చేసిందని కితాబిచ్చారు. ప్రభుత్వం మారితే వలంటీర్లు కూడా మారతారని చెప్పారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే, విజయవాడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో రామకృష్ణను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ బాబు, అర్బన్ యూనిట్ అధ్యక్షులు చావా రవి, ప్రెస్‌క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, సామ్నా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఐజేయూ నాయకులు ఎస్‌కే.బాబు తదితరులు పాల్గొన్నారు.