
లోక కళ్యాణం కోసం సత్యసాయి పని చేశారు : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సత్యసాయి సిద్దాంతానికి అంబాసిడర్లుగా బాబా భక్తులు మారాలి : సీఎం చంద్రబాబు
మహాసమాధి దర్శనం అనంతరం బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి, సీఎం, మంత్రి లోకేష్
పుట్టపర్తి, నవంబర్ 22 :- సత్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమ వంటిని పాటించాలని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పని చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు జాతి నిర్మాణం కోసం పని చేస్తోందని తెలిపారు. పుట్టపర్తిలో జరుగుతోన్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. అంతకు ముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ….
‘సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా మహాద్భాగ్యం. మానన సేవే మాధవ సేవ అని బాబా భావించేవారు. సమాజానికి సేవలందించిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రభాగాన ఉన్నారు. చాలామంది సత్యసాయి భక్తులు దేశ, విదేశాల్లో ఉన్న పేద వారికి సేవలందిస్తోన్నారు. 1969 నుంచే మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి బాబా సేవలందించారు. దీన్ని అందరూ పాటించాలి. బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్పూర్తితో పని చేస్తామని సంకల్పం తీసుకోవాలి’ అని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు.
సత్యసాయి సూత్రాలు పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుంది : సీఎం చంద్రబాబు
లవ్ ఆల్..సర్వ్ ఆల్, ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలి… ఎవ్వరిని నొప్పించకూడదు అనేది శ్రీ సత్యసాయిబాబా సిద్దాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా అనేవి సత్యసాయి బాబా ప్రవచించిన ఐదు సూత్రాలని పేర్కొన్నారు. సత్యసాయి బాబా చెప్పిన సిద్దాంతాలు.. సూత్రాలను పాటిస్తే ప్రపంచమంతా శాంతిగా ఉంటుందన్నారు. ‘ఆంధ్రా, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రజలకు తాగు నీటి సౌకర్యాన్ని కల్పించారు. సత్యసాయి బాబాతో నాకు మంచి అనుబంధం ఉంది. తాగు నీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారు. కానీ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు… పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగు నీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారు. ఇప్పటికే అదే స్పూర్తిని సత్యసాయి భక్తులు కొనసాగించడం నాకు సంతోషాన్నిస్తోంది. వివిధ ప్రాణాంతక రోగాల బారిన పడిన వారికి బాబా ట్రస్టు ఆదుకుంటోంది. మానవ సేవే… మాధవ సేవ అనే సిద్దాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్ట్ అమలు చేసి చూపిస్తోంది. శాంతికి బ్రాండ్ అంబాసిడర్లుగా సత్యసాయి బాబా భక్తులు
నిలుస్తారు. 7.50 లక్షల వాలంటీర్లు సత్యసాయి బాబా ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నారు…ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదు. నేడు సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రొగ్రాం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే సత్యసాయి బాబా స్పూర్తితో సేవలందిస్తారు. ధనవంతులు… ఉన్నతాధికారుల కుటుంబాలకు చెందిన పిల్లలను సైతం ప్రశాంతి నిలయానికి పంపి సేవా కార్యక్రమాలు చేయిస్తారు. 140 దేశాల్లో 2 వేలకు పైగా బ్రాంచ్ లు సత్యసాయి బాబా ట్రస్టుకు ఉన్నాయి. భగవాన్ సత్యసాయి బాబా భక్తులు శాంతికి అంబాసిడర్లుగా నిలవాలి. సత్యసాయి సాయిబాబా సిద్దాంతాన్ని సర్వత్రా వ్యాపితం చేసేలా కృషి చేయాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.
**
![]()
