రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కనీసం మద్దతు ధర రూ.8,110

Spread the love

రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కనీసం మద్దతు ధర రూ.8,110

వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, అక్టోబర్ 28 : రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మెంథా తుఫాను తీవ్రత నేపథ్యంలో, రైతులు నష్టపోకుండా ఉండేందుకు గాను, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే ప్రత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ, సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, 2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగైనట్లు, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలుకు రూ. 8,110/- కనీస మద్దతు ధరను రైతులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పత్తి అమ్ముకోవాలనుకునే రైతులు కొనుగోలు ప్రక్రియను సక్రమంగా పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను సీఎం యాప్ లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత “కపాస్ కిసాన్” యాప్‌లో అదే విఏఏ సహాయంతో స్లాట్ బుక్ చేసుకొని, స్లాట్ ప్రకారం సిసిఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి కొనుగోలు కేంద్రాల ద్వారా (జిన్నింగ్ మిల్లుల ద్వారా) మాత్రమే పత్తిని అమ్ముకోవాలని కోరారు. ఇందుకోసం జిల్లా వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారులు దిగువ స్థాయి సిబ్బందికి తగు సూచనలు ఇస్తూ, విఏఏ లు రైతులకు పూర్తి సహకారం అందించేలా పర్యవేక్షించి, కొనుగోలును విజయవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

మోంథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉన్నా రైతులు ఆందోళన చెందవద్దు

మోంథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉండబోతున్నా, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ఎన్నో తీవ్ర ప్రకృతి విపత్తులను విజయవంతంగా ఎదుర్కొన్నదని, ఈసారి కూడా అదే పద్ధతిలో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది అందరినీ అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వ్యవసాయ మరియు ఉద్యాన పంటల ప్రాథమిక నష్ట అంచనా నివేదికలు ఇప్పటికే సేకరించామని, ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు నష్ట నివారణ చర్యలు చేపట్టామని వివరించారు. రైతుల కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా 24 గంటల సలహా, సూచనలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పంటల నష్టం తగ్గించే చర్యలపై రైతులకు మార్గదర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. తుఫాన్ అనంతరం నష్టం వాటిల్లిన ప్రతి రైతును ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ క్లిష్ట సమయంలో రైతులు ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వం మీతో ఉంది, అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులను ముందుగా అప్రమత్తం చేసి వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని, వారి వలలు, బొట్లు రక్షించుకునే ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మూగజీవుల ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పాడి రైతులు బలహీన పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సూచనలు ఇచ్చామని, అధికారులు, సిబ్బంది ఎటువంటి సెలవులు తీసుకోకుండా హెడ్‌క్వార్టర్స్‌లో సిద్ధంగా ఉండాలని ఆదేశించామని మంత్రి అచ్చెన్న తెలిపారు.

Loading