రూ.100 కోట్లతో పెనుకొండలో ఇంటింటికీ తాగునీరు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

1
0

రూ.100 కోట్లతో పెనుకొండలో ఇంటింటికీ తాగునీరు

  • రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
  • పెనుకొండలో రూ.62 లక్షలతో అన్న క్యాంటీన్ కు భూమి పూజ
  • రూ.5 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం
  • త్వరలో రూ.1.50 సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు
  • రూ.16 కోట్ల ఎన్టీఆర్ స్మార్ సిటీకి త్వరలో భూమి పూజ
  • పెనుకొండ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నా…
  • మూడేళ్ల నుంచి సొంత నిధులతో అన్న క్యాంటీన్ నిర్వహణ : మంత్రి సవిత

పెనుకొండ : అమృత్ 2.0 పథకంలో భాగంగా పెనుకొండ పట్టణంలో రూ.100 కోట్లతో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రూ.5 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించనున్నామని, మరో రూ.2 కోట్లతో పెనుకొండ ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేయడంతో పాటు పరికరాలు అందజేయనున్నామని తెలిపారు. పెనుకొండ పట్టణంలో రూ.1.50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నామన్నారు. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదురుగా రూ.62 లక్షలతో ఏర్పాటు చేయనున్న అన్న క్యాంటీన్ కు ఎంపీ బీకే పార్థసారథితో కలిసి మంత్రి సవిత భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడు గుర్రాల్లా సీఎం చంద్రబాబునాయుడు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. పేదలకు మూడు పూటలా కడును నింపాలన్న సదుద్దేశంతో అన్న ఎన్టీఆర్ పేరు మీద 2014-19లో అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. తరవాత వచ్చిన జగన్ రెడ్డి ఆ క్యాంటీన్లను మూసివేశాడన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, సీఎం చంద్రబాబునాయుడు మరోసారి అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. కొత్తగా మరికొన్ని అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందన్నారు. దీనిలో భాగంగా రూ.62 లక్షలతో పెనుకొండలో అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కార్యకర్తలు కాలరు ఎగరేసేలా పాలన

కేవలం ఏడాది కాలంలోనే కూటమి నాయకులు, కార్యకర్తలు కాలరు ఎగరేసేలా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు.గత ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. ఉచిత ఇసుక, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేశామన్నారు. పోలవరం, అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పరిశ్రమలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీసుకొచ్చారన్నారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా సామాజిక పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు.

పెనుకొండ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నా…

పెనుకొండ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటునేలా పాలన సాగిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనంతగా శాసనసభ ఎన్నికల్లో తనకు 33,800 ఓట్లకు పై చిలుకు మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని పెనుకొండ పట్టణంలో చేపట్టామన్నారు. అమృత 2.0 పథకంలో భాగంగా పట్టణంలో రూ.100 కోట్లతో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీటి అందించున్నామన్నారు. రూ.5 కోట్లతో పెనుకొండలో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించనున్నామన్నారు. రూ.2 కోట్ల సీఎస్ఆర్ నిధులతో స్థానిక ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేయడంతో పాటు పరికరాలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన రైల్వే స్టేషన్ రోడ్డును ఇప్పటికే నిర్మించామని, కోనాపురం రోడ్డుకు భూమి పూజ చేశామని, త్వరలో పనులు చేపట్టనున్నామని తెలిపారు. పట్టణంలో రూ.1.50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తను దృష్టిలో పెట్టుకుని, ఐటీఐని ఏర్పాటు చేశామని తెలిపారు. తన తండ్రి, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి నిర్మించిన విద్యుత్ పోల్ సెంటర్ ను వినియోగంలోకి తీసుకురానున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. రూ.6 కోట్లతో టీటీడీ కల్యాణమండపం నిర్మించనున్నామన్నారు. నూతన ఆర్టీసీ డిపో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రూ.16 కోట్లతో ఎన్టీఆర్ స్మార్ట్ సిటీకి భూమి చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రులు లోకేశ్, నారాయణకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.

మూడేళ్ల నుంచి అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నా…

ఆర్థిక ఇబ్బందులున్నా… గత ఎన్నికల ముందు నుంచి పెనుకొండ పట్టణంలో సొంత నిధులతో అన్న క్యాంటీన్ ను నిర్వహిస్తూ వస్తున్నానని మంత్రి సవిత తెలిపారు. మూడేళ్ల నుంచి రోజుకు 400ల నుంచి 500ల మంది పేదలకు కడుపు నిండా భోజనం పెట్టామన్నారు. అన్న క్యాంటీన్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ నాయకులు ఈ అన్న క్యాంటీన్ ను అడ్డుకోడానికి ఎన్నో కుట్రలు పన్నారని మంత్రి మండిపడ్డారు. తొలుత అంబేద్కర్ సర్కిల్ వద్ద అన్న క్యాంటీన్ నిర్వహించగా తొలగించారని, తరవాత తన సొంత స్థలంలో ఏర్పాటు చేయడంతో ఏమీ చేయలేక పోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనందరావు, మున్సిపల్, ఇతర అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here