18.07.2025
విజయవాడ.
రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన సంబందిత శాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ కార్యాలయము నందు శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశములో ప్రజా పంపిణి వ్యవస్థ, మహిళా మరియు శిశు అభివృద్ది సంస్థ (అంగన్వాడి), మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్దుల వసతులు మరియు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకాల అమలు తీరును మరియు ఇతర లోటు పాట్ల గురించి ఆయా శాఖల అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ శ్రీ. చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ సరుకులు కార్డుదారులకు సక్రమంగా అందేల చూడాలని, అంగనవాడి సెంటర్లలో గర్భిణి స్త్రీలు/ బాలింతలు/పిల్లలకు ప్రభుత్వ నిబంధనల మేరకు భోజనం, గుడ్లు, బాలామృతం మరియు బాల సంజీవని వంటి పోషకాహారాలను సక్రమంగా పంపిణి చేయాలని సూచించినారు.
అలాగే పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్ళలో ఉండే విద్యార్దులకు ప్రభుత్వం నిర్ణయించిన “మెనూ” ప్రకారం భోజనం, గుడ్లు, చిక్కిలు అందించాలని తెలిపారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పధకం క్రింద గర్భిణి స్త్రీలకు మొదటి కాన్పుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 5,౦౦౦/- లతో పాటు అదనం గా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతం వారికి రూ. 1,000/- మరియు పట్టణ ప్రాంత ప్రజలకు రూ. 6౦౦ /- మరియు రెండవ కాన్పుకు ఆడ శిశువు అయితే 6,౦౦౦ ఒకేసారి ఇస్తారని వాటిని సక్రమం గా అందిచాలని సూచించారు.
పై పధకాలకు సంబంధించి, అమలులో ఎటువంటి లోటు పాట్లు ఉన్న సవరించడం, సంబంధిత అధికారులను అప్రమత్తం చేయటం, తప్పులు ఎక్కువగా ఉన్నచో సుమోటోగా తీసుకోని కేసులు పెట్టడం, జరిమానాలు విధించడం, అవకతవకలకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవలసినదిగా సంబంధిత శాఖల ఉన్నత అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని ఆహార కమీషన్ చైర్మన్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార కమీషన్ సభ్యులు బక్క ముంతల కాంతారావు, లక్ష్మి రెడ్డి ఇoడేల, జక్కంపూడి కృష్ణ కిరణ్ మరియు గంజిమాల దేవి, ఉప సంచాలకులు శ్రీ ఎ. శ్రీనివాసరావు మరియు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.