రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు

4
0

 

18.07.2024

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి

వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు

రాష్ట్రంలో గత నెలన్నర రోజులుగా శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విజయవాడ వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే ఇందుకు నిదర్శనమని ఓ ప్రకటనలో తెలిపారు. వినుకొండలో నడిరోడ్డుపై వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్య తీవ్రంగా కలిచివేసిందని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో కూటమి తప్ప ఇతర పార్టీ శ్రేణులు రోడ్లపైన తిరగకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఇటువంటి వికృత చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా ఇటువంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో రక్షణగా నిలవాల్సిన పాలకులే నేరస్థుల అవతారమెత్తుతున్నారని నిప్పులు చెరిగారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ.. కక్ష సాధింపులతో తెలుగుదేశం గూండాలు అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ఆటవిక పాలనలో చివరకు ప్రజాప్రతినిధులకే రక్షణ కరువైందని ఆరోపించారు. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని ఆయ‌న‌ తీవ్రంగా ఖండించారు. అలాగే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను చంపుతామని బెదిరించడం., జోగి రమేష్ ఇంటిపై అల్లరిమూకల దాడి., మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులు.. ఇలా వైసీపీ నేతలే లక్ష్యంగా పచ్చ బ్యాచ్ లు దాడులు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వీటిపై కనీసం సమీక్ష చేసే సమయం కూడా ముఖ్యమంత్రికి లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణ మారణకాండపై ఇప్పటికైనా గవర్నర్, కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. 

ప్రభుత్వ అసమర్థతతోనే మహిళలపై దాడులు

రాష్ట్రంలో మహిళలపై పెచ్చరిల్లుతున్న అరాచకాలు, దాడులను అరికట్టడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మల్లాది విష్ణు ఆరోపించారు. ఐదేళ్ల చిన్నారి నుంచి మహిళలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని.. రాష్ట్రంలో ఎక్కడా మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 8గంటలకు ఒక అత్యాచారం, రోజుకు 50 మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులను ఎత్తుకెళ్లి అత్యాచారాలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ధ్వజమెత్తారు. ముచ్చుమర్రి ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల క్షేమంగా తిరిగివస్తుందన్న నమ్మకం లేదంటే ముఖ్యమంత్రి చేతకానితనమే కారణమని ఆరోపించారు. ఆనాడు చంద్రబాబు పాలన ముగిసే నాటికి 2018 జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)విడుదల చేసిన నివేదిక ప్రకారం మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో 8వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. అటువంటి భయానక పాలనను బాబు మరలా తీసుకువస్తున్నారని వ్యాఖ్యానించారు. హోంమంత్రి సొంత జిల్లాలో మైనర్ బాలిక బద్ది దర్శిని(13) హత్య, విజయవాడ బృందావన్ కాలనీలో ప్రేమోన్మాది ఘాతుకం, విశాఖ మధురవాడలో ఐదేళ్ల బాలికపై లైంగికదాడి, పాడేరులో ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం, అనకాపల్లిలోనూ మరో ప్రేమోన్మాదం, ఆదోనిలో ట్రాక్టర్ తో ఢీకొట్టి దళిత మహిళ గుండమ్మ హత్య, గుంటూరు జిల్లాలో దళిత బాలిక(13)పై అత్యాచార ఘటనలు నిత్యకృత్యమైనా ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. స్వయంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలే కొన్ని కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారని మండిపడ్డారు. హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గంలోని కోటవురట్లలో తమ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఇద్దరు యువతులపై టీడీపీ నాయకులు దాడిచేసి దుస్తులు చింపి, వారిని జట్టుపట్టుకుని రోడ్డుపైన ఈడ్చుకెళ్లిన దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. అయినా మహిళలపై జరుగుతున్న దాడులపై ఇప్పటికీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా స్పందించలేదని మల్లాది విష్ణు ఆరోపించారు. ఘటనలపై హోంమంత్రిని ప్రశ్నిస్తే విచారణ జరుపుతామని చేతులు దులుపుకుంటున్నారు తప్ప బాధితురాలికి మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. ఘటన జరిగినప్పుడు ఒక స్టేట్‌ మెంట్‌ ఇచ్చేసి, ఎంతో కొంత ఆర్థిక సాయం చేసేస్తే సరిపోతుందా..? తల్లిదండ్రుల కడుపుకోతకు వెలకట్టగలరా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడంలో ఉన్న చిత్తశుద్ధి, శ్రద్ధ.. నేరస్తులను శిక్షించడంలోనూ చూపాలని డిమాండ్ చేశారు. లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపోరాటాలకు సిద్ధమవుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here