విజయవాడ, తేదీ: 29.09.2025
• రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తాం
• వాతావరణంలో క్లౌడ్ బరస్ట్ లాంటి మార్పులను పచ్చదనంతో అరికట్టవచ్చు
• పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి
- ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఎమ్. సుగుణమ్మ
ప్రజల బాగస్వామ్యంతో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయనున్నట్లు గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఎమ్. సుగుణమ్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ నూతన డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని మురళీ ఫార్చ్యూన్ హాటల్ లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆ సంస్ధ చైర్ పర్సన్ ఎమ్. సుగుణమ్మ మాట్లాడుతూ వాతావరణంలో సంభవిస్తున్న అకాల మార్పులను సరిచేయాలంటే రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ లు రెండూ కవలల పిల్లలుగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కే. పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు అహర్నిశలు పనిచేస్తున్నారన్నారని, వారు కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకుని డైరెక్టర్లందరూ రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలందరి భాగస్వామ్యంతో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించాలని, అప్పుడే వాతావరణంలో సంభవించే అసాధారణ మార్పులను అరికట్టవచ్చన్నారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ మార్చేందుకు డైరెక్టర్లందరూ సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రాజధానిని అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. స్వచ్ఛమైన గాలి పీల్చుకునే విధంగా గ్రీన్ కవర్ ను పెంచుతామన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలలో ఉన్న ఖాళీ భూముల్లో ఉద్యానవనాలు ఏర్పాటుకు ప్రణాళిక కోసం ఈ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. వాతావరణంలో క్లౌడ్ బరస్ట్ లాంటి అకాల మార్పుల వల్ల కురుస్తున్న వర్షాలను పచ్చదనంతో అరికట్టవచ్చు అని అన్నారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చెత్త తొలగించిన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పచ్చదనాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిందని, ఒకవైపు ఆ చెత్తను తొలగిస్తూనే మరో వైపు రోజువారీ వచ్చే చెత్తను తొలగించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వం పై ఏర్పడిందన్నారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీ తీసుకొస్తున్నామని దీని ద్వారా రీసైక్లింగ్ పార్కులు తీసుకొస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర పార్క్ లు అనే నమూనా రాష్ట్రమంతటా అమలు చేయడానికి ప్రతిపాదించిన ఒక దార్శనిక నమూనా ప్రాజెక్ట్ అని అన్నారు. ఈ పార్కులు వ్యర్థాలను తగ్గించడం, పునరుత్పాదక శక్తి జీవ వైవిధ్య పరిరక్షణ, ప్రజా భాగస్వామ్యం అనే లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. స్థిరమైన పట్టణ అభివృద్ధికి ఆదర్శప్రాయమైన ప్రదేశాలుగా ఇవి మారుతాయన్నారు. ఆరోగ్యాంధ్ర సాధించాలంటే స్వచ్ఛతలో మనందరం సమిష్టిగా ముందుకు వెళ్లాలని తెలిపారు. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్స్ అందరూ సమిష్టిగా పచ్చదనంపై అవగాహనకు క్షేత్ర స్థాయి పర్యటనతోపాటు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను తెలుసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్
మేనేజింగ్ డైరెక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు మాట్లాడుతూ 2015 లో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ను కంపెనీస్ యాక్ట్ కింద చైర్మన్ మరియు డైరెక్టర్స్ తో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ఖాళీ ప్రదేశాల్లో పచ్చదనాన్ని పెంపొందించటంతోపాటు పార్కుల అభివృద్ధికి ఒక బృహత్తర ప్రణాళికలను ఈ సంస్థ రూపొందిస్తుందన్నారు. పార్కులు ఎలా ఉండాలి అవి ప్రజలకు ఎలా ఉపయోగపడతున్నాయో, ఏ మొక్క ఎప్పుడు ఎక్కడ వేయాలి అనే పరిస్థితులను అంచనా వేస్తుందన్నారు. రాష్ట్రంలో పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సాంకేతికతను, ప్లానింగ్ ను అందిస్తుందని సీఈవో ఎంకేవీ శ్రీనివాసులు తెలియజేశారు.
ముందుగా స్వాగతోపన్యాసం చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ యూ. సుధ మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించటానికి అందరం సమిష్టిగా కృషి చేస్తామన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఎం. సుగుణమ్మ డైరెక్టర్లు చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఉద్యోగులు, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారి బంధువులు పాల్గొన్నారు.
![]()
