రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయండి : యార్లగడ్డ
గన్నవరం :
గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో రహదారి విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రహదారి విస్తరణ పనుల పురోగతిపై మంగళవారం రాత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు రహదారి పై ఉన్న ఆక్రమణలను తొలగించిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో రహదారి ఆక్రమణలు తొలగించిన భాగంలో రహదారి అంచులను డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్ లైన్లు ఏర్పాటు డివైడర్ల నిర్మాణం డివైడర్ పై పచ్చదనం ఏర్పాటు గురించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి ఈ రహదారిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ రహదారిపై మళ్ళీ ఆక్రమణలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారి విస్తరణకు నిధుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్న ఆయన అత్యంత నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరం నడిబొడ్డున ఉంటూ,విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఈ రహదారి అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం తహసిల్దార్ శివరావు, ఎంపీడీవో స్వర్ణలత, ఏఈలు దాసు, శ్రీహరి, సుజాత, వెంకట్ రాజు తదితరులు పాల్గొన్నారు.