మహోన్నత నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా
రంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సామినేని ఉదయభాను
విజయవాడ ,జూలై 4 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశం కృషి చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా మహోన్నత నాయకుడని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను కొనియాడారు. శుక్రవారం విద్యాధరపురంలోని విఎం రంగా జంక్షన్ వద్ద ఉన్న స్వర్గీయ వంగవీటి రంగా విగ్రహం వద్ద విగ్రహ కమిటీ నాయకులు మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ, లింగం శివప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ వంగవీటి రంగా 78వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ రంగా విగ్రహానికి పూలమాలవేసి సామినేని నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి రంగా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ స్వర్గీయ రంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారంటే ఆయన ఎంతటి మహోన్నత నాయకుడో అర్థం అవుతుందని అన్నారు. స్వర్గీయ రంగా ఆశయాలను ఆయన అభిమానులుగా తాము ముందుకు తీసుకెళుతున్నామని ఉదయభాను చెప్పారు. ఎంతో కీలకమైన విద్యాధరపురం బైపాస్ సెంటర్లో స్వర్గీయ వంగవీటి రంగా నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మైలవరపు దుర్గారావు తదితరులను ఆయన అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ పేద ప్రజల కోసం స్వర్గీయ వంగవీటి మోహన రంగా తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని అన్నారు. రంగ స్ఫూర్తి యువతకు ఆదర్శప్రాయం అని ఆయన అన్నారు. కీలకమైన ఈ ప్రాంతంలో స్వర్గీయ రంగా నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని మైలవరపు దుర్గారావు, కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా మైలవరపు దుర్గారావును ముఖ్య అతిథులుగా పాల్గొన్న సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, టిడిపి నాయకులు ఎం ఎస్. బేగ్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్ మండల రాజేష్, జనసేన నాయకులు బాడిత శంకర్ తదితరులు శాలువాలతో సత్కరించారు. రంగా జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ కేక్ ను రంగా అభిమానుల ఆనందోత్సాహాల మధ్య నాయకులు కట్ చేశారు. అనంతరం 1500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, అత్తులూరి ఆదిలక్ష్మి పెద్దబాబు,బుల్లా విజయకుమార్, మరుపిళ్ళ రాజేష్,ఉమ్మడి వెంకటేశ్వరరావు,గుడివాడ నరేంద్ర రాఘవ, కూటమి నాయకులు, తిరుపతి అనూష, మల్లేపు విజయలక్ష్మి,కే.యస్.ఎన్ మూర్తి, రెడ్డిపల్లి రాజు, సంభన బాబురావు, ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.