మేమున్నామంటూ ఆర్‌డీవోల భ‌రోసా

Spread the love

ఎన్‌టీఆర్ జిల్లా, అక్టోబ‌ర్ 28, 2025

మేమున్నామంటూ ఆర్‌డీవోల భ‌రోసా

  • క్షేత్ర‌స్థాయిలో కె.చైత‌న్య‌, కె.బాల‌కృష్ణ‌, కె.మాధురిల విస్తృత త‌నిఖీలు

విజయవాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని చిట్టినగర్, గుణదలతో పాటు మొగల్రాజపురంలో కొండచరియల ముప్పు ఉన్న ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటికే దాదాపు 500 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. నిర్ల‌క్ష్యం చేయ‌కుండా పున‌రావాస కేంద్రాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. విజయవాడ నగరంలో ప్రమాదకరంగా ఉన్న ఆర్‌టీఏ కార్యాలయం గోడ అంచున నివసిస్తున్న 13 కుటుంబాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వీఎంసీ, ఆర్ అండ్ బి అధికారుల సహకారంతో శిథిలావస్థలో ఉన్న ఆ గోడను తొలగించారు. మాచవరం అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రం, ఆర్ఆర్ పేట పునరావాస కేంద్రం, మాచవరంలో దుర్బలంగా (వల్నరబుల్) భవనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. బుడమేరు కాలువ ప్రవాహాన్ని మధ్యకట్ట నుంచి గూడవల్లి వరకు పరిశీలించారు.
తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి.. ఎ.కొండూరు, రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాలలో విస్తృతంగా పర్యటించారు. ఆయా మండలాల సత్వర స్పందన బృందాలతో (రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్) సమావేశమై, పలు సూచనలు చేశారు. ఎ.కొండూరు ఎంపీడీవో కార్యాలయంలో విప‌త్తు ప్ర‌తిస్పంద‌న‌కు సిద్ధంగా ఉంచిన యంత్ర సామాగ్రిని, కంభంపాడు గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో, రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురంలో, రెడ్డిగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో, విస్స‌న్న‌పేట మండలంలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి పూర్తి సన్నద్ధతతో ఉండాలని అధికారులకు సూచించారు.
నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ అనాసాగరం, నందిగామ బీవీఆర్ కాల‌నీలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌తో క‌లిసి ఐతవరం గ్రామంలో వరి పొలాలను, రైతు సేవా కేంద్రాన్ని, పునరావాస కేంద్రాన్ని, నందిగామలో వరద ముప్పు ఉంచి ఉన్న డీవీఆర్ కాలనీని పరిశీలించారు. జగ్గయ్యపేటలో పురపాలక సంఘ కార్యాలయంలో విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంచిన యంత్ర సామాగ్రిని, జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని ప‌రిశీలించారు.

Loading