ఏలూరు/ముసునూరు, జూలై , 27 : ముసునూరు మండలం గోపవరం లో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోపవరంలో ఇటీవల మరణించిన బల్లవరపు రెడ్డియ్య కుటుంబ సభ్యులను ఆదివారం మంత్రి పరామర్శించారు. రెడ్డియ్య కుటుంబానికి అండగా ఉంటానని, ప్రభుత్వం నుండి సహాయం అందేలా కృషి చేస్తానని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజల ఇళ్ల వద్దకు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులను పెన్షన్ వస్తుందా.. సక్రమంగా ఇంటికే వచ్చి ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ తమకు ఒకటవ తేదీనే అందిస్తున్నారని, ఒకటవ తేదీ సెలవు దినం అయితే ముందు రోజే పెన్షన్ ఇంటికి వచ్చి అందిస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ తో తాము ఎంతో ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నామని మంత్రి కి ఆనందంతో తెలియయజేశారు. అదేవిధంగా మహిళలను తల్లికి వందనం పధకం కింద ఆర్ధిక సాయం బ్యాంక్ లో జమ అయ్యిందా అని అడుగగా, తల్లికి వందనం నిధులు తమకు అందాయని మహిళలు ఎంతో ఆనందంతో చెప్పారు. గ్రామంలో మురుగు నీరు నిల్వ కారణంగా దోమలు వ్యాప్తి చెందుతున్నాయని గ్రామస్తులు తెలియజేయగా వెంటనే మురుగునీరు పారుదలకు చర్యలు తీసుకోవాలని, దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను మంత్రి పార్థసారధి ఆదేశించారు.
మంత్రి వెంట రెవిన్యూ, పంచాయతీరాజ్, తదితర శాఖల అధికారులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.