ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 20, 2025
మహిళా ఉద్యోగులు పోటీల్లో పాల్గొనండి
ఏపీ ఎన్జీజీవో మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మల కుమారి
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు నిర్వహించనున్న ఆటపాటలు, వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మల కుమారి పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో మార్చి 4, 5 తేదీల్లో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, ఏపీ ఎన్జీజీవో హోంనందు నిర్వహించే మహిళల ఆటపాటలతో పాటు వివిధ పోటీలపై గురువారం మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మల కుమారి ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను సందర్శించి, ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల కుమారి మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఏటా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా మార్చి 4, 5వ తేదీల్లో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, గాంధీనగర్ ఏపీ ఎన్జీజీవో హోం నందు పలు విభాగాల్లో ఆటల పోటీలను నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో పరుగు, నడక, టగ్ ఆఫ్ వార్, టెన్నీ క్వాయిట్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్వంటి పోటీలను నిర్వహిస్తున్నామని.. గాంధీనగర్ ఏపీ ఎన్జీజీవో హోంలో క్యారమ్స్, చెస్, వ్యాసరచన, వక్తృత్వం, పాటలు, నృత్యం వంటి అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు ప్రశాంసా పత్రాలతో పాటు జ్ఞాపికలు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకుచెందిన మహిళా ఉద్యోగులు పోటీల్లో పాల్గొనేందుకు తరలివస్తారన్నారు. పోటీలకు ఆతిథ్యమిచ్చే ఎన్టీఆర్ జిల్లా మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని నిర్మల కుమారి పిలుపునిచ్చారు.
ప్రచార కార్యక్రమంలో రవాణాశాఖ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరి, ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ మహిళా కార్యవర్గ సభ్యులు రాజ్యలక్ష్మి, మాధవి, కె.శివలీల, విజయశ్రీ, రవాణా సంఘం ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు ఎం.రాజుబాబు, ఎస్ స్టి ఎ యూనిట్ అధ్యక్షులు ఎల్ వి ఆర్ కిషోర్, ఏపీ ఎన్జీజీవో నగరశాఖ అధ్యక్షులు సీవీఆర్ ప్రసాద్, ఉపాధ్యక్షులు సీహెచ్ మధుసూదన్‌రావు, పలువురు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.