ఎన్‌టీఆర్ జిల్లా, మే 26, 2025 మహాత్ముని ఆశయాల కీర్తి శిఖరం గాంధీ కొండపై యోగాంధ్ర జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*ఆరోగ్యవంతమైన శరీరం, ఆరోగ్యవంతమైన మనస్సు కలిగి ఉండాలని చెబుతూ.. దేహాన్ని దేవాలయంగా భావించి జీవితాంతం ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన మహాత్ముని ఆశయాల కీర్తి శిఖరమైన గాంధీ కొండపై యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉందని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా సోమవారం విజయవాడలోని గాంధీ హిల్‌పై గాంధీ హిల్ ఫౌండేషన్, జిల్లా యంత్రాంగం, ఏపీ టూరిజం డిపార్టుమెంటు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా ప్రజలకు యోగాతో కలిగే ప్రయోజనాలను వివరించి జీవితాంతం ఆచరించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు కూడా యోగా ఔన్నత్యంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా తొలుత గాంధీ హిల్‌పై నిర్వహించడం జరిగిందన్నారు. ఇదేవిధంగా భవానీ ద్వీపం, డా. బీఆర్ అంబేద్కర్ స్మృతివనం, కొండపల్లి ఖిల్లా తదితర ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యోగాచరణను నిత్యజీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకుంటూ ఆరోగ్య భారత్ సాకారానికి కృషిచేయడం ద్వారా మహాత్మునికి నిజమైన నివాళులు అర్పిద్దామన్నారు.కార్యక్రమంలో భాగంగా గాంధీజీ తాత్వికత, యోగా, సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే ప్రత్యేక ప్లానిటోరియం షో ప్రదర్శించారు. కార్యక్రమంలో గాంధీ హిల్ ఫౌండేషన్ ఛైర్మన్ డా. గాంధీ పీసీ కాజా, కార్యదర్శి వై.రామచంద్రరావు, సభ్యులు శివశంకర్ కస్తూరి, రావి శారద పాల్గొనగా బీహార్ యోగా విశ్వవిద్యాలయ స్వామి భక్తి చైతన్య, ఏపీ టూరిజం ప్రతినిధులు శిల్ప, ప్రసన్నలక్ష్మి, కృష్ణచైతన్య, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
