మచిలీపట్నం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్

4
0

ఇకపై ప్రతిరోజూ ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం!

కూటమి ప్రభుత్వ విజయాలను జులై 2నుంచి ఇంటింటికీ తీసుకెళ్లండి

కూటమిలో మనది పెద్దన్న పాత్ర… సమన్వయంతో ముందుకు సాగాలి

ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషిచేయండి

మచిలీపట్నం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్

మచిలీపట్నం: ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నేను ప్రతిరోజు 5గురు ప్రజలు, 5గురు కార్యకర్తలతో మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి, పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదు, తప్పనిసరి వారి సేవలను గుర్తిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… గత ఎన్నికలకు ముందు బాబు సూపర్ – 6, బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ, ఎన్నికల తర్వాత మన టిడిపి, సభ్యత్వం కార్యక్రమాల్లో కార్యకర్తలంతా చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ కార్యకలాపాలను డిజిటల్ విధానంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించి పనిచేసిన వారిని గుర్తించాలన్నదే మన పార్టీ విధానం. అధికారంలోకి వచ్చాక కేడర్ ను మరువకుండా చంద్రబాబు నేను ప్రతిజిల్లాకు వెళ్లినపుడల్లా కార్యకర్తలను కలుస్తున్నాం. పార్టీ అధినేత నుంచి కార్యకర్త వరకు పార్టీ ఆదేశాలను అమలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. పార్టీ సంస్థాగత విషయాలు, సమస్యలపై చంద్రబాబు తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నా. 10 నిర్ణయాల్లో ఒక తప్పు జరగొచ్చు,
తప్పులున్నపుడు వివిధ స్థాయిల్లో నాయకుల ద్వారా తమ దృష్టికి తెస్తే సరిదిద్దుకుంటాం అని లోకేష్ అన్నారు.

జులై 2నుంచి గడపగడపకు వెళ్లండి

జులై 2వతేదీ నుంచి ప్రతిఒక్కరూ గడపగడపకు వెళ్లి గత ఏడాది కాలంలో మనం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బాబు సూపర్ – 6 కార్యక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద ఒక్క జిఓ తో రూ.8,745 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశాం. ఆర్థిక ఇబ్బందులున్నా నిర్ణీత సమయానికే తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలుచేశాం. మెగా డిఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాం. పెద్దఎత్తున పరిశ్రమలను రప్పించడం ద్వారా అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనకు శాయశక్తులా కృషిచేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధులకు 4వేల పెన్షన్ అందజేస్తున్నాం. ఆగస్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నాం.

అహంకారం, ఇగోలను వీడండి!

అహంకారం, ఇగోలను ప్రజలు హర్షించరు. గత పాలకులు అహంకారంతో వ్యవహరించడం వల్లే 151 కాస్త 11కి పడిపోయింది. ఎవరైనా నాయకులు తప్పుగా ప్రవర్తిస్తే ఆ ప్రభావం పార్టీపై పడుతుంది. ప్రజల్లోకి వెళ్లి ఓర్పు, సహనంతో వారు చెప్పే సమస్యలను వింటూ పరిష్కారానికి కృషిచేయండి. గత ప్రభుత్వం కక్షసాధింపుతో నిలిపివేసిన ఉపాధి హామీ, నీరు – చెట్టు బిల్లులను 90శాతం వరకు క్లియర్ చేశాం, మిగిలినవి కూడా జులైలోగా అందజేసే ఏర్పాటుచేస్తాం. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలుంటే మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోండి. యువగళం పాదయాత్ర, శంఖారావం కార్యక్రమంలో మీ ప్రాంతానికి రాలేకపోయాను, ఆ తర్వాత నా అవసరం లేకుండా మీరు భారీ మెజారిటీతో పార్టీని గెలిపించారు. పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ బలం, బలహీనతలను నేను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నా. చట్టపరిధిలో రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి

గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి దివాలా తీయించింది. ప్రధాని మోడీజీ మనకు అన్నివిధాలా సహకరిస్తూ ఆక్సిజన్ అందిస్తున్నారు. అమరావతి, విశాఖ ఉక్కు, విశాఖ రైల్వే జోన్ వంటి అన్ని కోర్కెలను ప్రధాని తీరుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిడిపి, జనసేన, బిజెపిల కూటమి ఏర్పాటైంది, కూటమిలో మనది పెద్దన్న పాత్ర, సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగాలి. తెలుగుదేశం పార్టీ చొరవ వల్లే వక్ఫ్ బిల్లులో 4 కీలక సవరణలు చేశారు, అది మనకున్న కమిట్ మెంట్. పార్టీలో ఏ ఒక్క నాయకుడు మనం గతంలో పడిన ఇబ్బందులు, అవమానాలను మరువకూడదు. చంద్రబాబు ని అక్రమంగా అరెస్టు చేసినపుడు… నేను ఆయనను కలిసేందుకు తీవ్రస్థాయిలో పోరాడాల్సి వచ్చిందని లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఆర్టీసి చైర్మన్ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here