మంగళగిరిలో వైభవంగా ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర రథాన్ని లాగి యాత్రను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

Spread the love

 మంగళగిరిలో వైభవంగా ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర

రథాన్ని లాగి యాత్రను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

మంగళగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంగళగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యాన శ్రీ జగన్నాథుని రథయాత్ర వైభవంగా సాగింది. మంగళగిరి బస్టాండు వద్ద నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. శ్రీ జగన్నాధుడు, బలరాముడు, సుభద్రల విగ్రహాలకు తొలుత హారతి ఇచ్చిన లోకేష్… అనంతరం రథాన్నిలాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జై జగన్నాథ్, హరేకృష్ణ , హరేరామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. భక్తులు దారి పొడవునా శ్రీ జగన్నాథుని రథం ముందు పాటలు పాడుతూ, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఒడిశాలోని పిప్లి నుంచి తెప్పించిన రంగుల పందిరి ప్రధాన ఆకర్షణగా నిలచింది. కృష్ణచైతన్య తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన బృందావనం శ్రీల ప్రభుపాద అడుగుజాడలను అనుసరించి ఇస్కాన్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలను నిర్వహిస్తూ భగవంతుడికి సేవచేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా గురువారం మంగళగిరిలో నిర్వహించిన రథయాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజా సేవ అంటే పరమాత్ముడి సేవ అని అన్నారు. ఇప్పుడు అందరి దృష్టి మంగళగిరి వైపే ఉంది ఆ దేవుడి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు. ప్రజల కష్టాలు తొలగి అందరూ సుఖశాంతులతో ఉండేలా ఆ జగన్నాథుని ఆశీస్సులు అందరి పై ఉండాలని కోరుకున్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *