భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల సందర్భంగా కార్పొరేషన్ లో ఘన నివాళులు

Spread the love

విజయవాడ నగరపాలక సంస్థ
11-11-2025

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల సందర్భంగా కార్పొరేషన్ లో ఘన నివాళులు

విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద మౌలానా ఆజాద్ జన్మదిన వేడుకలను విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇన్చార్జి కమిషనర్ ఏ.రవీంద్రరావు ఘనంగా నిర్వహించారు. ముందుగా మౌలానా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు అర్పించారు.

ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాదులు వేశారన్నారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన యోధుడని, దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పని చేశారని గుర్తు చేశారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవ, మైనారిటీ సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ ఏ. రవీంద్రరావు భారతరత్న అబుల్ కలాం ఆజాద్ గురించి మాట్లాడుతూ 1912లో అల్-హిలాల్ పత్రిక ప్రారంభించి, బ్రిటిష్ వలస పాలనను తీవ్రంగా విమర్శించారన్నారు. ఖిలాఫత్ ఉద్యమం, అసహకార ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని 1923లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అతి యువ నాయకుడన్నారు. భారత మొదటి విద్యామంత్రిగా ఐఐటీలు, యూజీసీ, సాహిత్య – లలితకళా – సంగీత నాటక అకాడమీలు స్థాపించారన్నారు. హిందూ-ముస్లిం ఐక్యత, లౌకిక విద్యా విధానానికి బలమైన పునాది వేశారన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి చీఫ్ ఇంజనీర్ పి.సత్య కుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి. వెంకటనారాయణ, మేనేజర్ ప్రభావతి, విఎంసి సిబ్బంది పాల్గొన్నారు.

Loading