ఎన్‌టిఆర్ జిల్లా
తేది: 21.06.2025
భవిష్యత్తులో గేమ్ చేంజర్‌గా మారనున్న యోగా.
నిత్య యోగ సాధనతో...ఆరోగ్యం, సంపద.
యోగా విశిష్టత ప్రతి ఒక్కరూ ఆచరించాలి
వైభవంగా సాగిన అంతర్జాతీయ యోగా వేడుకలు
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
భారత దేశ వారసత్వ సంపద అయిన యోగా భవిష్యత్తులో ఒక గేమ్ చేంజర్‌గా మారనున్నదని ఆరోగ్య సంపదకు నిత్య యోగాసనాలు ఆచరించాలని యోగాసనాల వేడుకలు ముగింపు కాదని, నిత్య యోగాసాదనకు ఆరంభమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శనివారం యోగాసనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మీ, జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ, నగర పోలీస్ కమీషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డిసిపి కె.జి.వి సరిత, మాజీ మంత్రి పీతల సుజాత, ఏపిఎన్‌జివో రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ తదితరులు వేలాంధిమందితో కలిసి యోగాసనాలను ఆచారించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ నెల రోజుల పాటు నగరంలోని యోగా స్ట్రీట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బది, స్వచ్చంద సంస్థలు, యోగా ఆసోసియేషన్, యోగా వాకర్స్, తదితర అసోసియేషన్లు, మాజీ సైనికులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో యోగాసనాలను ఆచరించడం జరిగిందన్నారు. వారందరూ నేడు వేలాంధిగా తరలివచ్చి యోగాసనాలు ఆచరించడం అభినందనీయమన్నారు. జిల్లాలోని 605 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో 5,454 ప్రాంతాలలో 8 లక్షల 50 వేల మందికి శిక్షణ ఇచ్చి కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారంగా యోగాసనాలు ఆచరించారన్నారు. యోగా ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు.యోగాతో మానసిక ప్రశాంతత కలిగి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ స్వర్ణాంధ్ర`2047, వికసిత్ భారత్‌తో లక్ష్యాన్ని చేరుకుని ఆర్థిక పురోగతికి దోహదపడుతుందన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత మన భారతీయులదే అని అన్నారు. ఒత్తిడిని దూరం చేసి శారీరక మానసిక ఉల్లాసానికి ప్రకృతి ప్రసాధించిన గొప్ప వరం యోగా అని అన్నారు. ప్రతీ ఉద్యోగి రోజులో కొంత సమయాన్ని యోగాకు కేటాయించడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరిగి రక్త ప్రసరణ మెరుగుఅవుతుందన్నారు.యోగాలోని ప్రతి ఆసనంతోనూ ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని, ఆరోగ్య కర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. 45 నిమిషాల సరళ యోగాసనాలను అచరించడం వల్ల మధుమేహం, రక్తపోటు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.
నగర పోలీస్ కమీషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో అందరిని భాగస్వాములను చేస్తూ నెల రోజుల పాటు యోగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించుకున్నామన్నారు. మే 21వ నుండి ప్రతీ రోజు ఒక్కొక్క థీమ్‌లతో బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లోను పర్యాటక ప్రాంతాలలోను నిర్వహించుకున్నామన్నారు. కృష్ణానదిలో వాటర్ క్రాప్ట్ ` ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డులో నమోదు కావడం మన జిల్లాకు గర్వకారణమన్నారు. అందరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. ఒత్తిడిని దూరం చేసి మానసిక ఉల్లాసానికి యోగా సాధ్యపడుతుందని నగర పోలీస్ కమీషనర్ రాజశేఖర్ బాబు అన్నారు.
అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి ముఖ్యంగా అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సాగిన కళాత్మక ప్రదర్శన, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలను పోరాట పటిమను గుర్తుచేస్తూ నిర్వహించిన ప్రదర్శన ప్రతి ఒక్కరిలో దేశ భక్తి స్పూర్తిని నింపింది.
స్వచ్చాంద్ర` స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్టేడియం వద్ద జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, ఆర్‌డివో కె. చైతన్యలు మొక్కలు నాటారు.
కార్యక్రమంలో ప్లోటింగ్ యోగాలో వరల్డ్ రికార్డు సాధించడంలో పాల్గొని ముఖ్య భూమిక నిర్వహించిన యోగాఅసోసియేష్‌న్ సభ్యులకు, నెల రోజుల పాటు యోగా మాసోత్సవాలలో పాల్గొన్న జిల్లా అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సర్టిఫికెట్లు మెమెంటోలు అందజేశారు.