
ఎన్టీఆర్ జిల్లా, తేదీ: 18.11.2025
భవానీ భక్తులు సంతృప్తి చెందేలా అమ్మ దర్శనం కల్పిద్దాం..
- డిసెంబర్ 11 నుండి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ
- ఆరు లక్షల మంది భవానీ భక్తులు తరలివస్తారని అంచనా..
- భవానీ దీక్షా విరమణలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి..
- దసరా విజయోత్సవ స్ఫూర్తితో భవానీ దీక్షా విరమణలనూ విజయవంతం చేద్దాం
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు
మాలధారణ చేయడం ద్వారా భవానీ దీక్షలను స్వీకరించి అత్యంత నియమనిష్టలతో 41 రోజుల పాటు పూజలు చేసి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భవానీ భక్తులు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శనభాగ్యం కల్పించడంతో పాటు ఇరుముడుల సమర్పణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి దీక్షా విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు.
డిసెంబర్ 11 నుండి 15వ తేదీ వరకు నిర్వహించన్ను భవానీ దీక్షల విరమణ కార్యక్రమంపై మంగళవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, ఆలయ ఈవో వి.కె. శీనానాయక్ లతో కలిసి సమన్వయ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ డిసెంబర్ 11 నుండి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. భవానీ దీక్షల విరమణకు గత ఏడాది 3.20 లక్షల మంది భవానీ భక్తులు దర్శనానికి తరలిరావడం జరిగిందని.. ఈ ఏడాది ఆరు లక్షల మందికిపైగా భక్తులు తరలివస్తారని అంచనా వేయడం జరిగిందన్నారు. భవానీ మాలధారణ చేసి 41 రోజులు కఠోరమైన నియమనిష్టలు భక్తి శ్రద్దలతో పూజలు ఆచరించి అమ్మవారికి ఇరుముడులు సమర్పించేందుకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారన్నారు. అయిదు రోజుల పాటు భవానీ దీక్షా విరమణలు ఉంటాయని రోజుకు దాదాపు లక్ష వరకు భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. చివరి రెండు రోజుల్లో దాదాపు లక్షా 50 వేల మంది భవానీ భక్తులు రానున్న దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో అంచనాలకు మించి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన్నప్పటికి అధికారులు సమన్వయంతో చేసిన ఏర్పాట్లు కారణంగా ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని విజయవంతంగా ఉత్సవాలను నిర్వహించామన్నారు. ఇదే స్ఫూర్తితో టీమ్ ఎన్టీఆర్ జిల్లా భవానీ దీక్షల విరమణను విజయవంతం చేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు 36 సెక్టార్లను ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్‌కు ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు. ముఖ్యంగా భక్తుల హోల్డింగ్ పాయింట్లు కేశఖండన ప్రదేశాలు, స్నాన ఘట్టాలు, గిరిప్రదర్శన, క్యూ లైన్లు, ఇరుముడుల సమర్పణ, హోమ గుండం, లడ్డు విక్రయ కేంద్రాలకు సంబంధించిన సెక్టార్ అధికారులు అత్యంత అప్రమత్తంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ఇతర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భవానీ భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా సమాచార కేంద్రాలు నిరంతరం అనౌన్స్మెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని లడ్డు విక్రయ కేంద్రాలు, ఉచిత భోజన సౌకర్యకేంద్రాల సంఖ్య పెంచాలన్నారు. ఈ ఏడాది 10 వేల మందికి పైగా భక్తులు కలశ జ్యోతులను సమర్పిస్తారని ఇందుకు అవసరమైన ఏర్పాటు చేయాలన్నారు. క్యూ మార్గంలో వాటర్ ఫ్రూప్ షామియానాలు, క్వాయిర్ మ్యాట్లు ఏర్పాటు చేయాలని మ్యాట్లను మూడో రోజు మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు అవసరమైన తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, హోల్డింగ్ పాయింట్ల వద్ద మరుగుదొడ్ల సంఖ్య పెంచాలని టోల్ గేట్ నుండి ఓం టర్నింగ్ మధ్యలో మరుగుదొడ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవానీ భక్తుల దీక్షా వస్త్రాలను స్నాన ఘట్టాల వద్ద వదిలివేస్తారని ఆయా ప్రాంతాలలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వస్త్రాలను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏర్పాట్ల పరిశీలనకు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమన్వయ శాఖలకు సంబంధించి ఇద్దరు సిబ్బందికి విధులు కేటాయించాలన్నారు.
నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, సిబ్బంది.. వివిధ శాఖల అధికారులు, సెక్టార్ అధికారులను సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసి ఎటువంటి అవాంఛనీయల సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో 300లకు పైగా సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎక్కడ సమస్య ఎదురైనా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
భవానీ దీక్షా విరమణలకు ప్రణాళికాయుత ఏర్పాట్లు: ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్షా విరమణలను విజయవంతం చేసేందుకు ప్రణాళికాయుత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు మూడు ప్రదేశాలలో హెూమ గుండాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కలశ జ్వోతుల భక్తులు, భవానీ భక్తులకు చిన్న లడ్డు, పులిహోర ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ సహకారంతో గిరి ప్రదర్శన, అమ్మవారి ఊరేంగింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం సామాన్లు క్లోక్‌రూమ్‌ల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. లడ్డుల విక్రయానికి 14 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 850 మంది నాయి బ్రాహ్మణులతో 24 గంటలు కేశఖండన కేంద్రం నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నామన్నారు. భవానీ భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది 20 లక్షల లడ్డులు సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 15 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో దీక్షా విరమణలు జరిగేలా వివిధ శాఖల అధికారులతో సమన్వయం భవానీ దీక్షలు విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఈవో శీనా నాయక్ వివరించారు.
సమావేశంలో అదనపు డిప్యూటీ పోలీస్ కమీషనర్ జి.రామకృష్ణ, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఆలయ ఈఈలు కె. కోటేశ్వరరావు, పి. రాంబాబు, ఆలయ సహాయ ఇంజనీయర్లు, పర్యవేక్షకులు, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక, నగరపాలక సంస్థ, విద్యుత్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మత్స్యశాఖ వీఎంసీ, సమాచార శాఖ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
![]()
