భ‌క్తుల భ‌ద్ర‌త, వ‌స‌తుల‌పై ప్ర‌త్యేక దృష్టి

Spread the love

భ‌క్తుల భ‌ద్ర‌త, వ‌స‌తుల‌పై ప్ర‌త్యేక దృష్టి

  • మోడ‌ల్ గెస్ట్ హౌజ్‌లో ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ రూమ్‌
  • 24 గంటలూ అందుబాటులో స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు
  • ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌

ఈ నెల 11వ తేదీ గురువారం నుంచి 15వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న భ‌వానీ దీక్ష‌ల విర‌మ‌ణ కార్య‌క్ర‌మానికి సంబంధించి భ‌క్తుల భ‌ద్ర‌త‌తో పాటు వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టిన‌ట్లు ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ తెలిపారు.
బుధ‌వారం ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ‌.. విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానం ఈవో వీకే శీనా నాయ‌క్, పోలీస్‌, వీఎంసీ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి క్షేత్ర‌స్థాయిలో విస్తృతంగా ప‌ర్య‌టించి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఘాట్ల వ‌ద్ద జ‌ల్లు స్నానాలు, కేశ ఖండ‌న శాల‌, హోల్డింగ్ ఏరియాలు, గిరి ప్ర‌ద‌క్షిణ‌, క్యూలైన్లు, ప్ర‌సాదాల కౌంట‌ర్లు, అన్న ప్ర‌సాదం త‌దిత‌రాల‌కు సంబంధించి చేసిన ఏర్పాట్ల‌ను పరిశీలించి అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ మాట్లాడుతూ దాదాపు ఆరు ల‌క్ష‌ల మంది భ‌వానీ భ‌క్తులు వ‌చ్చేందుకు అవ‌కాశ‌ముంద‌ని, ఈ నేప‌థ్యంలో భ‌క్తుల భ‌ద్ర‌త‌తో పాటు స్వ‌చ్ఛ‌మైన తాగునీరు, వివిధ మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించిన‌ట్లు తెలిపారు. భ‌క్తుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిన‌ట్లు పేర్కొన్నారు. విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో నిరంత‌రం పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్న‌ట్లు వివ‌రించారు. మోడ‌ల్ గెస్ట్ హౌజ్ వ‌ద్ద క‌మాండ్ కంట్రోల్ రూమ్ (సీసీసీ) ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. 24 గంట‌ల పాటు మూడు షిఫ్ట్‌ల్లో వివిధ శాఖ‌ల అధికారులు ఇక్క‌డ విధులు నిర్వ‌ర్తిస్తార‌న్నారు. ఇరుముడి పాయింట్లు, హోమ గుండం, వినాయ‌క టెంపుల్‌, హోల్డింగ్ ఏరియాలు, టోల్ గేట్‌, ఘాట్లు త‌దిత‌ర ప్రాంతాల్లోనూ స‌మ‌న్వ‌య శాఖ‌ల బృందాలు అందుబాటులో ఉంటాయ‌న్నారు. ప్ర‌తిఒక్క‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి భ‌వానీ దీక్ష‌ల విర‌మ‌ణ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ కోరారు.

Loading