విజయవాడ, జూలై 17, 2025
• బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు, రోస్టర్ అమలు పై దృష్టి పెట్టాలి
• కేంద్ర పథకాలు సక్రమంగా అమలు చేయలి
• బ్యాంకు రుణాల మంజూరు, స్వయం ఉపాధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి నిలపాలి
– జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం అహిర్
అధికారులు క్రమశిక్షణ, నిబద్ధతతో వెనుకబడిన తరగతుల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేయాల్సి అవసరం ఉందని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం అహిర్ అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం స్టేట్ గెస్ట్ హౌస్, వివంతా హోటల్ లో వివిధ ప్రభుత్వ సంస్ధ ల్లో ఓబీసీ రిజర్వేషన్లు, రోస్టర్ అమలు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం అహిర్ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా సీపెట్ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ) సంస్థపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసారు, ఆ సంస్థ కార్యకలాపాలపై వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఆ సంస్థ ప్లాస్టిక్ కోర్సుల్లో ఇస్తున్న శిక్షణ, అనంతరం శిక్షణ పొందిన వారికి వస్తున్న ఉద్యోగ అవకాశాలను (ప్లేస్ మెంట్స్) ను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా శిక్షణ పొందిన వారు అందుకునే సర్టిఫికెట్స్ వారికి ఉపయోగపడే విధానాన్ని సీపెట్ డైరెక్టర్ డాక్టర్. సీహెచ్. శేఖర్ చైర్మన్ కు వివరించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ కు స్వాగతం తెలియజేస్తూ రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్స్ ఏ విధంగా అమలు అవుతున్నాయో చైర్మన్ అడిగి తెలుసుకున్నారన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఖాళీల భర్తీ ముఖ్యంగా పర్మినెంట్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్స్, రోస్టర్ విధానాలు కేంద్ర, రాష్ట్ర విధానాలకు అనుగుణంగా పాటిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేన్స్ అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి 56 బీసీ కార్పొరేషన్స్ కు చైర్మన్లను నియమించారన్నారు. ఆయా కార్పొరేషన్ల ద్వారా బీసీ లకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.
యూనియన్ బ్యాంకులో అమలౌతున్న ఓబీసీ రిజర్వేషన్లు, బ్యాక్ లాగ్ పోస్టుల అమలు తదితర విషయాలను చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా రోస్టర్ అమలు వంటి విషయాలు బ్యాంకుల్లో ఏవిధంగా అమలు చేస్తున్నారో ఆ సంస్ధ జోనల్ హెడ్ సీవీఎన్ భాస్కర్ రావు, రీజనల్ బ్యాంకు మేనేజర్ ఎంవీ తిలక్, లీడ్ బ్యాంకు మేనేజర్ కే. ప్రియాంక లను అడిగి తెలుసుకున్నారు. ఓబీసీ యూనియన్ నాయకులను కూడా ఓబీసీ రిజర్వేషన్లు బ్యాంకులు ఏ విధంగా అమలు చేస్తున్నాయో, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో మూడు జోన్లలో ఉన్న సిబ్బంది వివరాలను అధికారులు వివరించారు. బ్యాంకుల ద్వారా బీసీ లు పొందుతున్న లోన్ల వివరాలతో పాటు ఇప్పటి వరకు అందించిన లోన్ల వివరాలు చైర్మన్ కు అందించారు.
మంగళగిరి ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) అందిస్తున్న సేవలు, పోస్టుల వివరాలు, అమలౌతున్న రోస్టర్ పై అధికారులు చైర్మన్ కు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈవో డాక్టర్. ఏ. శాంతా సింగ్ వివరించారు. సంస్థలో ఓబీసీ ఉద్యోగాల్లో అమలు చేస్తున్న నిబంధనలు ఎలా ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వివంతా హోటల్ లో సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ పై నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ ప్రదాన కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు చైర్మన్ కు వివరిస్తూ రాష్ట్రంలో మొత్తం 18 వైద్య కళాశాలలు ఉన్నాయన్నారు. అందులో ఉన్న వైద్య సీట్ల సంఖ్య, అమలౌతున్న ఓబీసీ రిజర్వేషన్ల వివరాలను వివరించారు. రోస్టర్ విధానాలు అమలు చేస్తున్న తీరును చైర్మన్ కు వివరించారు. ఎంబీబీఎస్ సీట్ల భర్తీ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో అమలు చేస్తున్న వివరాలను సిద్ధార్ధ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు, ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన సంస్థ రిజిస్ట్రార్ రాధికా రెడ్డి లు వివరించారు. ఎంబీబీఎస్ సీట్ల భర్తీ లో యూనివర్శిటీ తీసుకుంటున్న చర్యలను అధికారులు చైర్మన్ కు వివరించారు.
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పై నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లిఖార్జున్ లు గౌరవ చైర్మన్ కు వివరించారు. బీసీ సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న రిజర్వేషన్స్, రోస్టర్ విధానాలు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ విషయాలను కూలంకుషంగా అడిగి తెలుసుకున్నారు. భారత ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను ఏ విధంగా అమలు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బీసీ యువతకు అందుతున్న ఉద్యోగాలు, విద్యా అవకాశాలపై అధికారులు చైర్మన్ కు వివరించారు.
సమీక్షా సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ రిటైర్డు జడ్జి ఏ. శంకరరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ మర్యాదపూర్వకంగా చైర్మన్ ను సత్కరించారు.