ఎన్‌టీఆర్ జిల్లా, ఆగస్టు 01, 2025
బంగారు కలలకు రోజా రంగుల రెక్కలు
- పీ4లో మేము సైతమంటూ ముందుకొచ్చిన రోజ్ సొసైటీ
మా మనసూ బంగారమేనని.. రాష్ట్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన మహాయజ్ఞమైన పీ4లో మేమూ భాగస్వాములమవుతామని.. తమ బాధ్యతగా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని, ఆ కుటుంబాలకు అండగా ఉంటామంటూ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు ముందుకొచ్చారు. శుక్రవారం సొసైటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ పీ4 విధానం విశిష్టతను వివరించారు. స్వర్ణాంధ్ర సాకారం దిశగా వేస్తున్న అడుగుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన పీ4 విధానంతో పేదల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయని, 2029 నాటికి శూన్య పేదరికం లక్ష్యంగా ఈ విధానాన్ని అత్యంత పారదర్శకంగా అమలుచేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో పైనున్న పది శాతం మంది సమాజంలోని అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలను అన్నివిధాలా పైకి తీసుకొచ్చేందుకు పీ4 విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. సమాజం అండతో ఎదిగిన వారు సామాజిక బాధ్యతగా తిరిగి సమాజానికి ఏదో ఒకటి చేయాలనే గొప్ప ఆలోచనతో బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా ముందుకొస్తున్నారన్నారు. జిల్లాలో 86,398 బంగారు కుటుంబాలను గుర్తించామని, ఇప్పటికే 4,279 మంది మార్గదర్శులుగా ముందుకొచ్చి 33,505 కుటుంబాలను దత్తత తీసుకున్నారని వివరించారు. పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు రెడ్‌క్రాస్, రోటరీ, ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) తదితర సంస్థలూ ముందుకొచ్చాయన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది స్వచ్ఛందంగా ముందుకురావాల్సిన అవసరముందని.. ప్రభుత్వ పిలుపునకు స్పందించి పీ4లో భాగమయ్యేందుకు ముందుకొచ్చిన రోజ్‌సొసైటీకి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సొసైటీ అడ్వైజరీ ఛైర్‌పర్సన్ డా. అడుసుమిల్లి సీతామహాలక్ష్మి, ప్రెసిడెంట్ సూరపనేని ఉషారాణి, సెక్రటరీ ఘంటసాల లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎ.రత్నలక్ష్మి, కంచర్ల శుభ, అట్లూరి సుమబిందు పాల్గొన్నారు.