ఎన్‌టీఆర్ జిల్లా/కొండపల్లి, జులై 10, 2025
ప్రభుత్వ తపనంతా మీ బంగారు భవితకోసమే..
- ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు
- సద్వినియోగం చేసుకోండి.. ఉజ్వల కెరీర్ దిశగా అడుగేయండి
- లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని నిజాయితీతో శ్రమించండి
- జిల్లా, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలి
- మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ప్రభుత్వ తపనంతా చిన్నారుల బంగారు భవిత కోసమేనని.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు కల్పించడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గురువారం జరిగిన ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీఎం 2.0)లో కలెక్టర్ లక్ష్మీశ.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, గౌరవ విద్యా శాఖమంత్రివర్యులు చిన్నారులకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమాలను ఆవిష్కరిస్తున్నారని.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒక చోటకు చేర్చి చిన్నారుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మెగా పీటీఎం నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో 1,453 పాఠశాలల్లో దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా మెగా పీటీఎంలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందన్నారు. ఈసారి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కూడా పీటీఎం నిర్వహిస్తున్నటుల తెలిపారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఇంటి దగ్గర విద్యార్థి ప్రవర్తన, విద్యార్థుల అభిరుచులు తదితర సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు ఈ ఆత్మీయ సమావేశం దోహదం చేస్తోందన్నారు. నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, యూనిఫాం, పుస్తకాలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం.. ఇలా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని.. మంచి లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు నిరంతరం శ్రమించాలని సూచించారు. డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, ఐఏఎస్, ఐపీఎస్.. ఇలా ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని నిజాయితీతో కష్టపడాలని సూచించారు. పాఠశాల దేవాలయం వంటిందని.. ఇక్కడే చిన్నారుల ఆశలు, ఆశయాలకు పునాది పడుతుందని.. కేవలం ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్టులు ఇప్పుడు ప్రభుత్వ బడుల్లోనూ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు రూపంలో అందించడం జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు.
హరిత శోభకు గ్రీన్ పాస్‌పోర్టు:
పర్యావరణ పరిరక్షణకు హరిత విస్తీర్ణం పెంపు ఎంతో ముఖ్యమైనదని.. చిన్నప్పటి నుంచే పర్యావరణం పట్ల చిన్నారులకు అవగాహన కల్పించేందుకు, సామాజిక బాధ్యతను గుర్తు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ పాస్‌పోర్టు అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. తాను నాటిన మొక్క ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా విద్యార్థి పాయింట్లు దక్కించుకునే వినూత్న కార్యక్రమమే గ్రీన్ పాస్‌పోర్టు అని వివరించారు. ఈ పాస్‌పోర్టులో నాటిన మొక్క పేరు, ఆ మొక్క శాస్త్రీయ నామం, విద్యార్థి ఫొటో తదితర వివరాలు ఉంటాయన్నారు. ఆన్‌లైన్ మానిటరింగ్ కూడా ఉంటుందని వివరించారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి లక్షా 61 వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన షైనింగ్ స్టార్స్ డి.జ్యోత్స్న, భార్గవి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. వారి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విజయంలో పాఠశాల పోషించిన పాత్రను వివరించారు.
థింక్ బిఫోర్ యూ క్లిక్:
ప్రస్తుత ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సైబర్ దాడులకు గురికాకుండా ఉండేందుకు విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా సైబర్ మోసాలను తప్పించుకునేందుకు వీలుంటుందన్నారు. అదేవిధంగా తాత్కాలిక ఉత్తేజం.. శాశ్వత నాశనానికి దారితీసే మాదక ద్రవ్యాలు వ్యక్తుల జీవితాలను, కుటుంబాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయనే విషయాన్ని ఈగెల్ బృందం సహాయంతో వివరించారు. డ్రగ్స్ వద్దు బ్రో.. పోస్టర్లను ఆవిష్కరించారు.
తల్లికి వందనం: భారతీయ సంస్కృతీసంప్రదాయంలో మాతృమూర్తి ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా పీటీఎం సందర్భంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తమ తల్లుల పాదాలను కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. మెగా పీటీఎంలో భాగంగా తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ ఛైర్ పోటీలు నిర్వహించి, వీజేతలకు బహుమతులు అందజేశారు. అమ్మ పేరిట ఓ మొక్క కార్యక్రమం ద్వారా కలెక్టర్ లక్ష్మీశ.. విద్యార్థులు, తల్లిదండ్రులకు మొక్కలు అందించారు. పాఠశాల ప్రగతి నివేదికను ప్రధానోపాధ్యాయిని వివరించగా.. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కలెక్టర్ లక్ష్మీశ కూడా కోలాటం ప్రదర్శనలో ఉత్సాహంగా పాలుపంచుకొన్నారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. సెల్ఫీ స్టాండ్ వద్ద ఫొటో దిగారు. పాఠశాల ప్రాంగణంలో ఓ మొక్క నాటారు.
కార్యక్రమంలో డీఈవో యువీ సుబ్బారావు, కొండపల్లి మునిసిపల్ ఛైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన, విద్యా కమిటీ ఛైర్‌పర్సన్ షేక్ బాజీబీ, పాఠశాల హెచ్ఎం బి.హేమలత, ఈగెల్ సెల్ ఎస్ఐ ఎం.వీరాంజనేయులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.