ఎన్టీఆర్ జిల్లా, జూన్ 25, 2024
ప్రభుత్వ ఆకాంక్షల మేరకు సేవలందిద్దాం
రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి
నారా చంద్రబాబునాయుడు సారథ్యంలోని నూతన ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు సేవలందించి.. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనించేలా సమష్టిగా కృషిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు.
ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎ. విద్యాసాగర్, అసోసియేషన్ సభ్యులతో కలిసి మంగళవారం మంత్రి కొలుసు పార్థసారథిని నగరంలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించేందుకు కృషిచేయాలన్నారు. సంక్షేమం-అభివృద్ధి తారకమంత్రంగా తొలిరోజు నుంచి ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు 100 శాతం ప్రజలకు చేరువయ్యేలా చేయడం కోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వంలో భాగమైన వివిధ విభాగాలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా విధులను నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలను, పరిపాలన విధానాన్ని ఉద్యోగులందరూ ప్రత్యక్షంగా పరిశీలించారని గుర్తు చేశారు. రానున్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రం దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలంటే ఉద్యోగుల సహకారం ఎంతో అవసరం అన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి రావలసిన ప్రతి ప్రయోజనాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఉద్యోగి సంతోషంగా విధులు నిర్వహించేలా,
సంతృప్తికర స్థాయిలో ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. వివిధ విభాగాల ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తమ తమ సంఘాల సమావేశాల్లో ఇదే విషయాన్ని అందరికీ తెలియజేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ప్రతి ఉద్యోగి భవిష్యత్తు తరాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలవాలన్నారు. ఒకవైపు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ మరోవైపు రాష్ట్రాన్ని సామాజికంగా, పారిశ్రామికంగా, ఆర్థికంగా ప్రగతి బాటలో పయనించేలా చేసి దేశంలో అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు సమష్టి కృషి అవసరమని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
మంత్రి పార్థసారథిని కలిసిన వారిలో కార్యదర్శి మహమ్మద్ ఇక్బాల్, అసోసియేట్ ప్రెసిడెంట్ పి. రమేష్ , కోశాధికారి వి. సతీష్, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి దిలీప్, శివలీల, నగర శాఖ అధ్యక్షుడు సివిఆర్ ప్రసాద్, కార్యదర్శి షేక్ నజీరుద్దీన్, అసోసియేట్ ప్రెసిడెంట్ పి. రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ పి. మధుసూదన రావు, వైస్ ప్రెసిడెంట్ కేసర్ గణేష్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు మాచిరాజు అక్కిరాజు, నాలుగవ తరగతి ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. చంద్రశేఖర్, సహాధ్యక్షులు పి సాయిరాం తదితరులతోపాటు ఏపీ ఎన్జీజీవో జేఏసీలో భాగమైన సంఘాల నాయకులు ఉన్నారు.