
తేది:31.10.2025
అమరావతి
ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతాం
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నవంబర్ 4 నుండి 6 వరకు లండన్ లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 సమావేశంలో పాల్గొననున్న మంత్రి దుర్గేష్.. 30 మంది ప్రతినిధులతో చర్చలు జరపనున్న మంత్రి దుర్గేష్
రాష్ట్రంలోని అద్భుతమైన సహజ సిద్ధ ప్రదేశాలు, చరిత్ర, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిపేలా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ వేదికగా ప్రచారం చేయనున్న మంత్రి దుర్గేష్ సారథ్యంలోని ఏపీ బృందం
అమరావతి: ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతామని మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేయడంతో పాటు రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేష్ నవంబర్ 4 నుండి 6 వరకు లండన్ లో పర్యటించనున్నారు. సుస్థిర పర్యాటక రంగ వృద్ధి, డిజిటలైజేషన్ చేయడం, ఇన్ బౌండ్ టూరిజంను మెరుగుపరిచే ఉద్దేశంతో మూడు రోజుల పాటు లండన్ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా లండన్ లో 30 మంది ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకానికి ప్రమోషన్ కల్పించనున్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను, విప్లవాత్మక నిర్ణయాలను వెల్లడించి అక్కడికి వచ్చే ఇన్వెస్టర్లను ఆకర్షించనున్నారు.వరల్డ్ ట్రావెల్ మార్కెట్ వేదికగా ఏపీ స్టాల్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అద్భుతమైన సహజ సిద్ధ ప్రదేశాలు, చరిత్ర, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిపేలా ప్రచారం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాల ప్రదర్శనను ప్రదర్శించనున్నారు. అంతేగాక ఏపీ బృందంతో పాటు ప్రఖ్యాత స్టేక్ హోల్డర్స్ ను, ట్రావెల్ ఆపరేటర్లను తీసుకెళ్లనున్నారు. అక్కడికి వచ్చే ప్రతినిధులకు కూచిపూడి నృత్యంతో స్వాగతం పలికి, అరకు కాపీని, ఆంధ్రా ఫేమస్ పూతరేకుల రుచి చూపించడంతో పాటు జీఐ ట్యాగ్ పొందిన ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను బహుమతిగా అందించనున్నారు.
లండన్ పర్యటనలో భాగంగా పలు దేశాల్లో పర్యాటక రంగం ఎలా అభివృద్ధి చెందుతున్నదో అధ్యయనం చేసి ఏపీ పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర సహకారం, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి తీసుకుంటున్న చర్యలను వరల్డ్ ట్రావెల్ మార్కెట్ వేదికగా వినిపించి ఏపీ పర్యాటక రంగాన్ని సరికొత్తగా పరిచయం చేస్తామన్నారు. ఏపీ పర్యాటక రంగాన్ని విశ్వవ్యాప్తం చేయడం వల్ల విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని, తద్వారా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని భావిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. అన్ని రాష్ట్రాల, పలు దేశాల పర్యాటక బోర్డులు, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, గ్లోబల్ హాస్పిటాలిటీ బ్రాండ్లు, టూర్ ఆపరేటర్లు, డెస్టినేషన్ మేనేజ్ మెంట్ కంపెనీలు తదితర ఇన్వెస్టర్లను ఒకచోట చేర్చే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రదర్శన ద్వారా ఏపీ పర్యాటక వాణిని వినిపించి వినూత్న పెట్టుబడులు ఆకర్షిస్తామని మంత్రి దుర్గేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొననున్నారు. మంత్రి కందుల దుర్గేష్ ను వరల్డ్ ట్రావెల్ మార్కెట్ -2025లో పాల్గొనేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నవంబర్ 2వ తేదీన లండన్ పర్యటనకు బయలుదేరనున్నారు.
![]()
