ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా కలిసి పనిచేద్దాం

Spread the love

విజయవాడ, తేది: 20.11.2025

• ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా కలిసి పనిచేద్దాం
• ఘనంగా 5 వ ఆడిట్ దివస్ వేడుకలు ప్రారంభం
• నవంబర్ 20 నుండి 28 వరకు వేడుకల నిర్వహణ
• రాజ్యాంగ స్ఫూర్తి మార్గదర్శకంగా కాగ్ విశ్వసనీయతను కొనసాగిద్దాం
• మారుతున్న కాలంతోపాటు అధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

  • ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ అండ్ ఈ) ఎస్. శాంతి ప్రియ ఆధునిక సాంకేతికతతో వినూత్న ఆడిట్ పద్ధతులను అవలంబిస్తూ భవిష్యత్ కు బాటలు వేసేలా మానవవనరులను తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ అండ్ ఈ) ఎస్. శాంతి ప్రియ తెలిపారు. గురువారం స్థానిక స్టాలిన్ బిల్డింగ్ 8 వ అంతస్తులోని మల్టీపర్పస్ హాల్ లో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ అండ్ ఈ) ఎస్. శాంతి ప్రియ చేతుల మీదుగా 5 వ ఆడిట్ దివస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏ అండ్ ఈ) ఎస్. శాంతి ప్రియ మాట్లాడుతూ అధునాతన సాంకేతికతలైన ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సేవలను పరిపాలనలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా ప్రజా వనరులను సక్రమంగా వినియోగిస్తూ పనిచేయాలన్నారు. సమాజంలో సమున్నత మార్పులకు నాయకత్వం వహించడం, విలువలు పునరుద్ఘాటించడం, విశ్వాసం, ఆవిష్కరణ, సుస్థిరత, జవాబుదారీతనం లక్ష్యంగా పనిచేయాలన్నారు. జ్వోతి ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించిన తర్వాత పరిపాలన, పారదర్శకత, జవాబుదారీతనంలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్) పాత్రను, చేస్తున్న కృషిని వివరించారు. కాగ్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ ప్రధానమైన ఆడిట్ బాధ్యతతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అకౌంట్స్ మరియు ఎన్ టైటిల్ మెంట్స్ విధులను సమర్థవంగా నిర్వహిస్తోందన్నారు. ఆడిట్ వ్యవస్థ స్వతంత్రతను, విశ్వసనీయతను, అత్యున్నత ప్రమాణాలను కాపాడటంలో అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి మార్గదర్శకంగా సమిష్టి లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. రాజ్యాంగపరమైన విశ్వాసాన్ని నిలబెట్టడంలో అధికారులు, ఉద్యోగుల సమిష్టి కృషి అవసరమని సూచించారు. పనిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ, వినూత్న ఆడిట్ పద్ధతులను అవలంబిస్తూ ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటూ కాగ్ నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా సాధించాలని ఉద్యోగులకు ఉద్భోదించారు. క్షుణ్ణమైన ఆడిటింగ్ ద్వారా ప్రజా ధనం సమర్థవంతంగా వినియోగించబడుతుందన్న విషయాన్ని ప్రజలకు, శాసనసభకు, కార్యనిర్వాహక వర్గాలకు వివరించాల్సిన అవసరాన్ని తెలిపారు. రాజ్యాంగ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ప్రతి ఉద్యోగి గర్వపడాలన్నారు.

డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (ఏఎంజీ-3) సుష్మా మాట్లాడుతూ భారత కంప్ట్రోలర్ మరియు ఆడిట్ జనరల్ నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు వ్యవస్థ నిర్మాణంలో గణనీయమైన పాత్ర పోషించనున్నాయని తెలిపారు. తమది చారిత్రాత్మకమైన సంస్థగా అభివర్ణించారు. 5 వ ఆడిట్ దివస్ వేడుకల్లో భాగంగా క్విజ్ పోటీలు, ఆర్ అండ్ ఐ వర్క్ షాప్, డ్రాయింగ్ పోటీలు, ఎయిమ్స్ ద్వారా వైద్య ఆరోగ్యంపై చర్చ, స్వయం ఆర్థిక వృద్ధిపై చర్చలు, ఆడిట్ మరియు అకౌంట్స్ వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆడిట్ దివస్ వేడుకలు విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) ఆర్.శ్యామ్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అడ్మిన్) వి. లలిత్ కుమార్, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కుశాల్, నాబార్డ్ జీఎం మహేష్ సింగ్, ఆర్బీఐ డీజీఎం అనంతీ, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్స్ విజయవాడ డైరెక్టర్ రమేష్ శ్రీకొండా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.

Loading