ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తూట్లు

Spread the love

 *28.08.2024*

ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం తూట్లు

*వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యభద్రతకు తూట్లు పొడుస్తోందని విజయవాడ వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. అన్ని ప్రాంతాలలో విషజ్వరాలు విజృంభిస్తున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో మురుగు కాలవలన్నీ దోమలకు ఆవాసాలుగా మారాయని.. ఫలితంగా నగర ప్రజలు దోమకాటు వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటి వ్యవస్థనూ పట్టించుకోకపోవడంతో మంచినీరు కలుషితమై ప్రజలు డయేరియా బారిన పడుతున్నారన్నారు. జనం పిట్టల్లా రాలిపోతున్నా.. వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖల అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వానికి కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజారోగ్యంపై లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల నగర ప్రజలను వింత జ్వరాలు వేధిస్తున్నాయని.. ఒక్క సెంట్రల్ లోనే అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, గుణదల ప్రాంతాలలో అతిసారం బారిన పడి అనేక మంది ఆస్పత్రుల పాలయ్యారని వెల్లడించారు. 

*వైఎస్ జగన్ హయాంలో..*

వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య అవ‌స‌రాలు తీర్చడమే లక్ష్యంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని మల్లాది విష్ణు చెప్పారు. దేశమంతా కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడుతుంటే… ఏపీ ప్రజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు. ప్రజల ఆరోగ్యానికి పూర్తిస్థాయి భరోసాని కల్పిస్తూ.. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, 108, 104 సర్వీసుల పెంపు, ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా నాణ్యమైన వైద్యాన్ని అందించినట్లు చెప్పారు. వైఎస్సార్ మానసపుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని జ‌గ‌నన్న హయాంలో మరింత పటిష్టపరిచి ప్రొసీజర్లను 3,257 కి పెంచడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచడం చారిత్రాత్మకమన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఐదేళ్ల కాలంలో అక్షరాల రూ. 170 కోట్ల విలువైన వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా అందించినట్లు చెప్పారు. అలాగే 4 నూతన అర్బన్ హెల్త్ సెంటర్లను ఈ ప్రాంతంలో ప్రారంభించుకున్నట్లు తెలిపారు. వీటిలో 60 రకాల టెస్టులతో పాటు 172 రకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ప్రతి ఇంటిని జల్లెడపడుతూ చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను నియోజకవర్గంలో 52,519 మంది సద్వినియోగపరచుకున్నట్లు తెలిపారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని మల్లాది విష్ణు ఆరోపించారు. స్పెషలిస్టు వైద్యులు సహా సిబ్బంది నియామకాలు నిలిపివేసి.. పేదల జేబులకు కూటమి సర్కారు చిల్లులు పెడుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాల్సిందిగా సూచించారు. వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని రకాల సీజనల్ మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చి.. ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *