ఎన్‌టీఆర్ జిల్లా/నందిగామ, జులై 22, 2025
పీ4తో పేదల జీవితాలు బంగారుమయం
- 2029 నాటికి పేదరికం నిర్మూలనే లక్ష్యం
- అత్యంత పారదర్శకంగా p4 అమలుకు సమష్టి కృషి
- అర్హత ఉన్న ప్రతి కుటుంబాన్నీ జాబితాలో చేర్చుతాం
- ఇప్పటికే 3,669 మంది మార్గదర్శులుగా ముందుకొచ్చారు
- ఇంటింటి సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
స్వర్ణాంధ్ర సాకారం దిశగా వేస్తున్న అడుగుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన పీ4 విధానంతో పేదల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయని.. 2029 నాటికి శూన్య పేదరికం లక్ష్యంగా ఈ విధానాన్ని అత్యంత పారదర్శకంగా అమలుచేస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ నందిగామ మండలం, కేతవీరునిపాడులో పీ4 విధానానికి సంబంధించి బంగారు కుటుంబాల అవసరాలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంకా ఏవైనా బంగారు కుటుంబాలు రిజిస్టర్ కాకుండా మిగిలిపోయాయా? తదితర వివరాల నమోదుకు, డేటా కచ్చితత్వానికి జరుగుతున్న ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర దిశ దశను మార్చే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారని, ఈ విజన్‌కు సోపానాలు అయిన పది సూత్రాల్లో మొదటిది జీరో పావర్టీ అని, సమాజం నుంచి పేదరికాన్ని పూర్తిగా దూరంచేసే లక్ష్యంతో పీ4 విధానాన్ని తెచ్చినట్లు తెలిపారు. సమాజంలో పైనున్న పది శాతం మంది సమాజంలోని అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలను అన్ని విధాలా పైకి తీసుకొచ్చేందుకు పీ4 విధానాన్ని తీసుకురావడం జరిగిందని.. జిల్లాలో 86,398 బంగారు కుటుంబాలను గుర్తించామని.. ఇప్పటికే 3,669 మంది మార్గదర్శులుగా ముందుకొచ్చారని, 28,992 కుటుంబాలను దత్తత తీసుకున్నారన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ముందుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కేవలం ఆర్థిక వనరులే కాదు.. బంగారు కుటుంబాల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, స్వయం ఉపాధి, ఆరోగ్య అవసరాలు వంటివాటి విషయంలో మార్గదర్శులు చేయూతనిచ్చి, పేదరికం నుంచి బయటపడేలా చేస్తారని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
ఏ కుటుంబమూ పేదరికంతో ఉండిపోకూడదు:
సమాజంలో ఏ ఒక్క కుటుంబమూ పేదరికంతో మగ్గిపోకూడదని, పీ4 విధానంతో ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని, అర్హత ఉన్న కుటుంబం ఇంకా బంగారు కుటుంబాల జాబితాలో లేకుంటే ఆ కుటుంబాలను కూడా చేర్చడం జరుగుతుందన్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేకపోవడం, రక్షిత తాగునీరు అందకపోవడం, బ్యాంకు ఖాతా, ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్, విద్యుత్ సౌకర్యం లేకపోవడం తదితర వివరాల ఆధారంగా జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు. పీ4 విధానాన్ని అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలుచేసేందుకు వీలుగా డేటా చాలా కచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామసభలను కూడా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు.