
ఎన్‌టీఆర్ జిల్లా, నవంబర్ 08, 2025
పథకాల స్ఫూర్తికి అనుగుణంగా అభివృద్ధి అడుగులు..
- స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలు
- జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలపైనా ప్రత్యేక దృష్టి
- ఆయుష్మాన్ భారత్-డా. ఎన్‌టీఆర్ వైద్య సేవతో విస్తృత సేవలు
- భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగానూ జల్ జీవన్ మిషన్, అమృత్ ప్రణాళికలు
- 20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్
పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థంచేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ప్రధానమని.. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలుకావాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు 20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు.
శనివారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో 20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్.. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశతో కలిసి వైద్య ఆరోగ్యం, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్‌లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జననీ సురక్షా యోజన (జేఎస్‌వై), జననీ శిశు సంరక్ష కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన తదితర పథకాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించే జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాలకు సంబంధించిన అంశాలపై సమీక్షించి, పురోగతికి అవసరమైన కార్యాచరణపై సూచనలు చేశారు. బహుళ ప్రయోజనాల పీఎం సూర్యఘర్ పథకం అమల్లోనూ మరింత చొరవ చూపాలన్నారు. సమీక్షా సమావేశం అనంతరం లంకా దినకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో100 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని.. జననీ సురక్షా యోజన ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 1,685 మందికి, పట్టణ ప్రాంతాల్లో 924 మందికి లబ్ధి చేకూరిందన్నారు. అదేవిధంగా జననీ శిశు సంరక్ష కార్యక్రమం ద్వారా ఉచిత పౌష్టికాహారం, మందులు, వైద్య పరీక్షలు వంటి సేవలు అందుతున్నాయన్నారు. స్వర్ణాంధ్ర విజన్ @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తోందని.. ఈ క్రమంలో మాతా శిశు మరణాల రేటును తగ్గించడంపై అధికారులకు సూచనలు చేసినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ కార్యక్రమం కింద జిల్లాలో జగ్గయ్యపేట, ఎ.కొండూరు, తిరువూరులో డయాలసిస్ సేవలు అందుతున్నాయని.. మొత్తంమీద 20 కేంద్రాల ద్వారా ఈ సేవలు అందుతున్నాయన్నారు. ఎ.కొండూరు ప్రాంతంలో డయాలసిస్ సేవల విస్తృతికి చర్యలు తీసుకుంటున్నట్లు లంకా దినకర్ వెల్లడించారు.
సమన్వయ శాఖల సమష్టి కృషి
చిన్నారులు, గర్బిణీల్లో రక్తహీనత సమస్యలు లేకుండా చూడటంలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యం, విద్యాశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నాన్నారు. ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన – డా. ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి చూస్తే ఇప్పటివరకు రూ. 58 కోట్ల విలువైన వైద్య సేవలు అందాయన్నారు. 108 వాహనాలు (28) 104 వాహనాలు (21), 102 వాహనాలు (20) ద్వారా సేవలందుతున్నాయని.. 108 వాహనాలకు సంబంధించి రెస్పాన్స్ టైమ్‌ను తగ్గించేందుకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయం అవసరమని అధికారులకు సూచించినట్లు తెలిపారు. 104 వాహనాల ద్వారా ప్రతిగ్రామంలోనూ నెలకు రెండుసార్లు స్థానికులకు సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సిద్ధార్థ వైద్య కళాశాల అభివృద్ధి కార్యకలాపాలపైనా చర్చ జరిగిందని.. పీఎం స్వాస్థ్య సురక్షా యోజన (పీఎంఎస్ఎస్‌వై) ద్వారా రూ. 150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి చేయడం జరుగుతోందని, ఈ పనులు కూడా చివరిదశలో ఉన్నట్లు తెలిపారు. బహుళ అంశాల్లో పరిశోధన విభాగం ద్వారా 17 రకాల ప్రాజెక్టులపై పనిచేస్తున్నట్లు వివరించారు. ఆడిటోరియం అభివృద్ధికి దాదాపు రూ. 9 కోట్లు అవసరమవుతుందని కళాశాల ప్రిన్సిపల్ తెలిపినట్లు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధనకు సురక్షిత తాగునీరు కూడా ఒక కీలక అంశమని.. జల్ జీవన్ మిషన్‌కు సంబంధించి మొత్తం పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లడం జరుగుతోందని, రూ. 500 కోట్ల మేర ఉన్న ప్రాజెక్టు వ్యయం నేడు రెండు వేల కోట్లు వరకు అవుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధికారులు సరైన సమాచారం, ప్రణాళికలతో సిద్ధం కావాలని సూచించినట్లు తెలిపారు. వీఎంసీ పరిధిలో అమృత్ 1.0 కింద దాదాపు రూ. 100 కోట్లతో చేపట్టిన పనులు పూర్తికావొస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగానూ తాగునీటి సరఫరా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం అమల్లోనూ వేగం పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. త్వరలో ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించి విద్యా శాఖపై సమీక్ష నిర్వహించనున్నట్లు లంకా దినకర్ వెల్లడించారు.
సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో వై.శ్రీలత, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎ.విద్యాసాగర్, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డా. డి.చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, డా. ఎన్‌టీఆర్ వైద్య సేవ సమన్వయ అధికారి డా. జె.సుమన్ తదితరులు పాల్గొన్నారు.
![]()
